షెఫాలి ఫామ్‌ అందుకునేనా?

నేడు మలేసియాతో భారత్‌ పోరు
మధ్యాహ్నం 1 గంట నుంచి

సిల్‌హట్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షెఫాలి వర్మ ఫామ్‌ అందుకునేందుకు మరో అవకాశం వచ్చింది. ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం జరిగే పోరులో మలేసియాతో భారత్‌ తలపడనుంది. స్పల్ప స్కోర్లకే ఔటవుతున్న షెఫాలి తేలికైన ప్రత్యర్థిపై ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. 18 ఏళ్ల షెఫాలి.. గత మార్చి తర్వాత అర్థసెంచరీ చేయలేదు. కామన్వెల్త్‌ క్రీడల్లో ఒకటి రెండు మెరుపు ఆరంభాలు ఇచ్చినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయింది. ఇక ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఫుట్‌వర్క్‌ విషయంలో ఆమె మెరుగుపడాల్సి ఉంది. ఇక మిగిలిన బ్యాటర్లలో స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో శ్రీలంకతో భారత్‌ తొలి మ్యాచ్‌లో పునరాగమనం చేసిన జెమీమా రోడ్రిగ్స్‌ కూడా అర్థసెంచరీతో మెరిసింది. ప్రయోగాలు చేయాలనుకుంటే యువ కెరటం కిరణ్‌ నవ్‌గిరెకు తుది జట్టులో చోటు కల్పించే అవకాశాలున్నాయి. బౌలింగ్‌లో రేణుక సింగ్‌ జోరు మీద ఉంది. దీప్తిశర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌, రాధ యాదవ్‌ విజృంభిస్తే భారత్‌కు ఎదురుండదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని