ఫ్రాన్స్‌ ఘనారంభం

ఆస్ట్రేలియాపై 4-1తో విజయం

అల్‌ వాక్రా: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఘనవిజయంతో ఆరంభించింది. స్టార్‌ స్ట్రైకర్‌ కరీమ్‌ బెంజెమా గాయంతో టోర్నీ నుంచి వైదొలిగినప్పటికీ.. ఆ ప్రభావం ఏమాత్రం కనిపించనివ్వకుండా కంగారూ జట్టుపై ఫ్రాన్స్‌ చెలరేగింది. ప్రధాన ఆటగాళ్లు కిలియన్‌ ఎంబాపె, ఒలివియర్‌ గిరౌద్‌ అంచనాలను అందుకుంటూ ఆరంభ పోరులో చక్కటి ప్రదర్శన చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 4-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టింది ఆస్ట్రేలియా కావడం విశేషం. 9వ నిమిషంలోనే క్రెయిగ్‌ గుడ్‌విన్‌ గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లడంతో ఫ్రాన్స్‌ ఆటగాళ్లు, అభిమానులు షాక్‌ తిన్నారు. సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓటమి నేపథ్యంలో మరో సంచలనం నమోదవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తర్వాత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌దే అధిపత్యం. 27వ నిమిషంలో యువ ఆటగాడు అడ్రియన్‌ రాబియట్‌ గోల్‌తో స్కోరు సమం చేసిన ఫ్రాన్స్‌.. ఇంకో అయిదు నిమిషాలకే గిరౌద్‌ గోల్‌ సాధించడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధంలో ఆటంతా ఎంబాపెదే. మైదానంలో మెరుపులా కదిలిన అతను.. 68వ నిమిషంలో గోల్‌ సాధించడమే కాక, 72వ నిమిషంలో చక్కటి పాస్‌తో గిరౌద్‌ రెండో గోల్‌ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు