భద్రతా కవచం సాకారం

సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో నేర నియంత్రణ.. ప్రజలకు భరోసా
కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌


రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన వినూత్న వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాం. రాష్ట్రం ఏర్పడ్డాక పలుమార్లు అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ, నాటి సిటీ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డిలతో పాటు మేధావులు, మాజీ డీజీపీలతో చర్చించాం.  ఈ క్రమంలోనే నిలువెత్తు భద్రతా కవచాన్ని నిర్మించుకున్నాం. కరోనా వైరస్‌ ప్రభావంతో రెండేళ్లు ఆలస్యమైనా అద్భుతం సాకారమైంది.

-సీఎం కేసీఆర్‌


నేర నియంత్రణతో పాటు ప్రజలకు భద్రతపై భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి రూపకల్పన చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూ.585 కోట్ల వ్యయంతో పూర్తయిన ఈ కేంద్రాన్ని, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కొత్త కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. మాజీ డీజీపీలు, పోలీసు ఉన్నతాధికారులు వీలుచూసుకుని ఈ కేంద్రానికి వచ్చి లోటుపాట్లపై చర్చించాలని కోరారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లవగా శాంతిభద్రతలకు భంగం కలిగే సంఘటనలు జరగలేదని, హైదరాబాద్‌ శాంతిభద్రతల నిలయంగా మారిందని అన్నారు. చిన్నాచితకా నేరాలు నమోదవుతున్నా.. ఇకపై మరింత కట్టడి చేస్తామని చెప్పారు. కొద్దిరోజుల కిందట గోదావరికి వరద పోటెత్తడంతో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లాం. బస్సులో వెళ్లేప్పుడు డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులతో చర్చించాం. సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం వంటివి అనూహ్యంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడో ఉండే సైబర్‌ నేరస్థుడు హైదరాబాద్‌ ప్రజలను మోసం చేస్తున్నాడు. డ్రగ్స్‌ వినియోగం అణుబాంబు కన్నా ప్రమాదకరం. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్‌ నగరంలో డ్రగ్స్‌కు బానిసలైన వారు రోడ్లపై ఉంటారన్న భయంతో ప్రజలు బయటకు వచ్చేవారు కాదు. న్యూయార్క్‌ మేయర్‌, పోలీస్‌ కమిషనర్‌ ఒక సంకల్పాన్ని తీసుకుని 96శాతం డ్రగ్స్‌ నేరాలను కట్టడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సైబర్‌ నేరాల కట్టడికి, మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగానికి పోలీసులు చెక్‌ పెట్టాలి. ఇందుకు ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించండి. ఉన్నతాధికారులను నియమించండి. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తగిన అంశాలను పాఠ్య ప్రణాళికల్లో చేర్చాలి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి చర్యలు చేపట్టాలి.

సింగపూర్‌ ప్రమాణాలు అందుకుంటాం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఒకసారి సింగపూర్‌ వెళ్లాం. మా బృందంలో ఒక యువ మహిళా ఐఏఎస్‌ అధికారి ఉన్నారు. అక్కడ పెట్టుబడులు, వ్యాపారపరమైన చర్చలు జరుగుతున్నప్పుడు సింగపూర్‌ ప్రతినిధుల్లో కొందరు ‘మిస్టర్‌ రావు... మా సింగపూర్‌ ప్రమాణాలను మీరు ఎప్పుడు అందుకుంటారు’  అని నవ్వుతూ అన్నారు. అర్ధరాత్రయినా సరే.. మహిళలు క్షేమంగా వెళ్తారంటూ వారు చెప్పిన మాటలు నిజమేనా అని పరీక్షించాలనిపించింది. అర్ధరాత్రి దాటాక ఆ మహిళా అధికారిని నిర్మానుష్య ప్రాంతాలకు పంపించాం. దూరంగా ఉంటూ గమనించాం. సింగపూర్‌ ప్రతినిధుల మాటలు నిజమని తేలింది. ఆ ప్రమాణాలను అందుకుంటాం. రాష్ట్రంలోనూ మహిళలు సురక్షితంగా వారి గమ్య స్థానాలు చేరుకునేలా చర్యలు చేపట్టాం. హైదరాబాద్‌లో నేరాలు క్రమంగా తగ్గుతున్నాయి. మరింతగా వీటిని తగ్గించేందుకు పోలీసు యంత్రాంగానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చనున్నాం.

సమాజానికి అవసరమైన వారిని వదులుకోం

కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం కర్త, రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి.. నా ఆలోచనలను ఆయనతో పంచుకుంటే అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన ఎంతో కృషి చేశారు. కొత్త విధానాలను అందుబాటులోకి తెచ్చారు. ఆయన డీజీపీగా ఈ ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకుంటాం. సమాజానికి అవసరమైన వారిని వదులుకోం. మాజీ డీజీపీ అనురాగ్‌ శర్మ, మాజీ అధికారి ఏకేఖాన్‌ ఇంకా సేవలందిస్తున్నారు.

99% పేకాట క్లబ్బులు లేవు

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అని నేను అన్న మాటలను కొందరు వక్రీకరిస్తున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంస్కారవంతమైన పోలీసింగ్‌ అవసరం. నేరస్థులపట్ల కఠినంగా వ్యవహరించాలి, వారి పీచమణచాలి. గతంలో పేకాట క్లబ్బులు, గబ్బులుండేవి.. గుడుంబా మాఫియా ఉండేది.. ఇప్పుడు 99శాతం లేవు.. మిగిలిన ఒక్క శాతం కూడా నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తాం. అద్భుతమైన సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ను నిర్మించేందుకు శ్రమించిన అధికారులు, కార్మికులు, శ్రామికులకు అభినందనలు. పచ్చదనానికి 35శాతం భూమి కేటాయించాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.


అన్ని ప్రభుత్వ శాఖలూ వినియోగించుకోవచ్చు: డీజీపీ

త్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వప్నం. అంతర్జాల ఆధారిత నేరాలకు పాల్పడుతున్న నేరస్థులు విజ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. అలాంటివాటిని ముందుగానే పసిగట్టి కట్టడి చేయాలన్నదే కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఉద్దేశం. దీనిని పోలీస్‌శాఖ మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలూ వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, రాజాసింగ్‌, బిగాల గణేశ్‌ గుప్తా, ఎస్‌.సైదిరెడ్డి, నోముల భగత్‌, మేయర్‌ విజయలక్ష్మి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఏసీబీ డీజీ అంజనీకుమార్‌, నిఘా విభాగపు అధిపతి ఎస్‌.అనిల్‌ కుమార్‌, రహదారులు భవనాల శాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, మాజీ గవర్నర్‌ రామ్మోహన్‌రావు, మాజీ డీజీపీలు స్వరణ్‌జిత్‌ సేన్‌, దినేష్‌రెడ్డి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


ఔటర్‌ రోడ్లపై వాహనాలను చూడొచ్చా?
కమాండ్‌ కంట్రోల్‌ నిపుణులకు కేసీఆర్‌ ప్రశ్నలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కేంద్రంలో ఏకకాలంలో లక్ష కెమెరాలను చూసేందుకు వీలుందని పోలీస్‌ అధికారులు సీఎంకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌, యాదాద్రి దేవాలయం, హైదరాబాద్‌, వరంగల్‌.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనుసంధానం చేశామని చెబుతూ ఇక్కడి కమాండ్‌ కంట్రోల్‌ నుంచే సాంకేతిక నిపుణులు తెరపై సీఎం కేసీఆర్‌కు చూపారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌పై వెళ్తున్న వాహనాలు కనిపిస్తాయా అని అడగ్గా అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా వాహనాలను చూడొచ్చని వారు వివరించారు.

సర్‌.. ఇక్కడే భోజనం చేయండి...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తమతో పాటు భోజనం చేయాలని అభ్యర్థించారు. ఫర్వాలేదు.. వెళ్తానంటూ కళ్లతోనే చెబుతుండగా... హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వచ్చి అభ్యర్థించారు. దీంతో ముఖ్యమంత్రి వారితో పాటు భోజనానికి వెళ్లారు.

ఇంకా ఖరారు కాని పేరు

కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు పెడతారంటూ గతంలో పోలీస్‌ అధికారులు తెలిపారు. మంచిపేరు పెట్టాలంటూ ప్రజలు, నెటిజన్లను సీవీ ఆనంద్‌ కోరారు. వేల సంఖ్యలో పేర్లు వచ్చాయి. వాటి నుంచి ఒక పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపిక చేస్తారని వివరించారు. ప్రారంభోత్సవం రోజైన గురువారం పేరు ప్రకటించలేదు. ఇంకా ఖరారు చేయలేదని పోలీస్‌ వర్గాలు తెలిపాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని