‘ఆసరా’ కోసం ఆశగా..!

రెండు నెలలుగా ఆగిన పింఛన్ల పంపిణీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఆసరా పింఛన్ల సొమ్ము ఎప్పుడు జమవుతుందో తెలియని అయోమయం నెలకొంది. రెండు నెలలుగా పంపిణీ నిలిచిపోయింది. దీంతో ఆ సొమ్ముపైనే ఆధారపడిన లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

రాష్ట్రంలో 38.41 లక్షల మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర విభాగాల కింద ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016, ఇతరులకు నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. గతంలో ప్రతినెలా ఒకటి నుంచి ఐదోతేదీ నాటికి చెల్లింపులు జరిగేవి. నిధుల విడుదల ఆలస్యం కావడంతో కొన్ని నెలలుగా 25వతేదీ వరకు జమచేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెల పింఛన్లు ఏప్రిల్‌లో చెల్లించారు. మే నెలవీ ఆలస్యంగానే జమయ్యాయి. జూన్‌ నెలవి ఇప్పటివరకు పంపిణీ కాలేదు. జూన్‌కు సంబంధించిన నగదు ఆగస్టు మొదటి వారంలో విడుదలైనట్టు గ్రామీణాభివృద్ధిశాఖ పేర్కొన్నప్పటికీ ఇప్పటికీ బ్యాంకులు సహా ఇతర పంపిణీ సంస్థల్లో జమకాలేదు. దీంతో పింఛన్ల వచ్చాయా? లేదా? తెలుసుకునేందుకు ప్రతిరోజూ లబ్ధిదారులు బ్యాంకులు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ల తాలూకూ బిల్లులను గ్రామీణాభివృద్ధిశాఖ పంపించినప్పటికీ, ఆర్థికశాఖలో నిలిచిపోయినట్లు సమాచారం.

రాష్ట్రంలో 65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, వితంతువుగా మారిన మహిళలు, ఇతర కేటగిరీల కింద దరఖాస్తు చేసిన 3.30 లక్షల మంది మూడున్నరేళ్లుగా పింఛన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఆయా  నియోజకవర్గాలకు చెందిన దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది. మిగతా దరఖాస్తులపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు కుదించిన తరువాత మరో 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది గడుస్తున్నా వీటి పరిష్కారంపైనా సర్కారు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో వారికీ నిరాశ తప్పడం లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని