జల విద్యుత్‌ కేంద్రాల పర్యవేక్షణకు ప్రత్యేక బోర్డు

ఆర్‌ఎంసీ ముసాయిదా నివేదికపై చర్చించిన తెలంగాణ, ఏపీ
జల విద్యుత్‌.. రూల్‌కర్వ్స్‌... మిగులు జలాలపై చర్చ
మూడు అంశాలపైనా రెండు రాష్ట్రాల సానుకూలత
తాగునీటి అవసరాలకు ఎండీడీఎల్‌ హద్దులు వద్దన్న తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రత్యేక బోర్డు (స్టాండింగ్‌) లేదా జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) చేపట్టాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. జల విద్యుత్‌ ఉత్పత్తి, జలాశయాల రూల్‌కర్వ్స్‌, మిగులు జలాల వినియోగానికి సంబంధించి మూడు అంశాలపై సమగ్ర నివేదికను అందించేందుకు కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) రూపొందించిన ముసాయిదా నివేదికపై గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో కమిటీ సమావేశం జరిగింది. కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై నేతృత్వంలో తెలంగాణ సభ్యులు మురళీధర్‌ (ఈఎన్‌సీ), వెంకటరాజం (జెన్‌కో డైరెక్టర్‌), ఏపీ సభ్యులు నారాయణరెడ్డి (ఈఎన్‌సీ), సత్యనారాయణ (జెన్‌కో డైరెక్టర్‌) హాజరయ్యారు.  

పవర్‌హౌస్‌ల నిర్వహణ

శ్రీశైలం కుడి, ఎడమ గట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేసినా రెండు రాష్ట్రాలు చెరిసగం పంచుకోవాలని ముసాయిదాలో పేర్కొనగా దానికి రాష్ట్రాలు అంగీకరించలేదు. ఏ రాష్ట్రానికి అవసరం ఉంటే ఆ రాష్ట్రం ఉత్పత్తి చేసుకుంటుందని పేర్కొన్నాయి. సాగునీటి అవసరాలకుగాను శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం (ఎండీడీఎల్‌) 805 అడుగుల వద్ద కొనసాగించాలని డ్రాఫ్ట్‌లో పేర్కొనగా 815 అడుగులను కొనసాగించాలని రాష్ట్రాలు తెలిపాయి.  

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు ఇప్పటివరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీనికి బదులు రెండు రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రత్యేకంగా శాశ్వత స్టాండింగ్‌ బోర్డును ఏర్పాటు చేయడం లేదా ఆర్‌ఎంసీ ఆదేశాల మేరకు నిర్వహణ చేపట్టేలా ఏర్పాట్లు ఉండాలనే నిర్ణయానికి వచ్చారు.

రూల్‌కర్వ్స్‌ అమలు..

శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్స్‌ ప్రకారం ఎండీడీఎల్‌ను జులై నుంచి అక్టోబరు వరకు 854 అడుగుల వద్ద కొనసాగించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. జూన్‌ నుంచి కొనసాగించేలా చూడాలని ఏపీ కోరగా కమిటీ అంగీకారం తెలిపింది. నాగార్జునసాగర్‌ నుంచి తాగునీటి  అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఎండీడీఎల్‌ అమలనేది అవసరం లేదని తెలంగాణ పేర్కొంది.

నాగార్జునసాగర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసి రివర్సబుల్‌ పంపింగ్‌ ద్వారా నీటిని జలాశయంలోకి తోడిపోసుకుంటున్న తెలంగాణ తరహాలో తమకూ అవకాశం కల్పించాలని ఏపీ కోరింది. జలాశయంలో నీటి నిల్వకు అవకాశం ఉన్నప్పుడు మాత్రం రివర్సబుల్‌ పంపులను వినియోగించుకోవచ్చంటూ తెలంగాణ సానుకూలత వ్యక్తం చేసింది. శ్రీశైలం జలాశయం రివర్సబుల్‌ పంపుల వినియోగంపైనా చర్చ జరిగింది

మిగులు జలాలపై..

ఏటా రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్న నీటిని రెండు రకాలుగా విభజించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. లభ్యత ఉన్న నీటి వినియోగం, మిగులు జలాల వినియోగం కింద లెక్కగట్టాలని తెలిపింది. జూరాల నుంచి పులిచింతల వరకు ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిన తరువాత పొంగిపొర్లే (స్పిల్లింగ్‌) నీటినే మిగులు జలాలుగా (సర్‌ప్లస్‌) గుర్తించనున్నారు. ఇతర జలాశయాలకు మిగులు జలాలు తరలించినా వాటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఒక వేళ ఆ జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహం వస్తే మాత్రం మిగులు జలాల లెక్కల నుంచి పరిహరిస్తారు. మిగులు జలాల వినియోగం అని పేర్కొనడానికి బదులు మిగులు జలాల మళ్లింపు అని చేర్చాలని ఏపీ కోరగా మిగులు జలాల మళ్లింపు/వినియోగం అని చేర్చాలని తెలంగాణ సూచించింది.


డాక్యుమెంటేషన్‌కు హక్కులేదన్న తెలంగాణ

ర్‌ఎంసీలో పరస్పరం చేసుకుంటున్న ఒప్పందాలన్నీ జలాశయాల నిర్వహణకు మాత్రమే పరిమితమైనవి(వర్కింగ్‌ అరేంజ్‌మెంట్స్‌)గా చూడాలని తెలంగాణ కమిటీకి సూచించింది. ట్రైబ్యునళ్లతోపాటు మరెక్కడా ఆర్‌ఎంసీ పాయింట్లను డాక్యుమెంట్లుగా ప్రవేశపెట్టడానికి వీలులేదని సూచించింది. దీనికి ఏపీ కూడా అంగీకారం తెలిపింది. ప్రస్తుత సమావేశంలో వ్యక్తమయిన అభిప్రాయాలను నమోదు చేసిన కమిటీ వాటి మినిట్స్‌ను రెండు రాష్ట్రాలకు అందించనుంది. ఈ నెలాఖరులోపు మరోమారు సమావేశం ఏర్పాటు చేసి కృష్ణాబోర్డుకు తుది నివేదికను అందించనుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని