వీఆర్వోల బదలాయింపు జీవోపై పిటిషన్‌..

నిలిపివేతకు నిరాకరించిన ధర్మాసనం
పిటిషనర్లకు యథాతథస్థితి కొనసాగింపునకు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వ విభాగాల్లోకి బదలాయించేందుకు జారీ చేసిన జీవో 121 చట్టబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. గండిపేటకు చెందిన జె.రవికుమార్‌, మరో 18 మంది దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవో అమలును నిలిపివేయడానికి నిరాకరించిన ధర్మాసనం పిటిషనర్ల వరకు యథాతథస్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సర్దుబాటులో భాగంగా కలెక్టర్లు కేటాయించిన పోస్టులో చేరాలని పిటిషనర్లలో ఎవరైనా భావిస్తే.. ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. వారికి జీతాల చెల్లింపు నిలిపివేయడానికి వీల్లేదంది. పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారిని తిరిగి మరో ప్రాంతంలో నియమించవచ్చని పేర్కొంది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది ఫణిభూషణ్‌ వాదనలు వినిపిస్తూ వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ఇతర శాఖల్లోకి బదిలీ చేసే ముందు వారిని సంప్రదించి అంగీకారం తీసుకోవాల్సి ఉందన్నారు. రెవెన్యూ శాఖలో 1500 పోస్టులకుపైగా ఖాళీలున్నప్పటికీ ఇతర శాఖల్లోకి బదిలీ చేయడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.


వీఆర్వోలు కోరుకుంటే వీఆర్‌ఎస్‌..

ఈనాడు, హైదరాబాద్‌: వీఆర్వోల పునఃవినియోగ ప్రక్రియపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. మొత్తం 5,137 మంది వీఆర్వోలలో గురువారం వరకు 5,014 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు అధికారులు వెల్లడించారు. 19 మంది విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని, వీరిలోనూ 15 మంది కొత్త పోస్టుల్లో చేరారని తెలిపారు. వీఆర్వోలను రెవెన్యూశాఖలో కొనసాగించేది లేదని, కొత్త పోస్టుల్లో విధులు నిర్వహించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) కోరుకునేవారికి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని