నిర్ణీత కాలంలో వైద్యులకు పదోన్నతులు

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అమలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు నిర్ణీత కాలంలో పదోన్నతులు పొందేలా నిబంధనలను సవరిస్తూ వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకనుగుణంగా కళాశాలల వారీగా పదోన్నతులకు అర్హులైన అధ్యాపకుల సమాచారాన్ని పంపించాల్సిందిగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రధానాచార్యులను ఆయన ఆదేశించారు. గతంలో జారీచేసిన ఉత్తర్వుల్లో కేవలం సహాయ ఆచార్యులు మాత్రమే నిర్ణీత కాలంలో(నాలుగేళ్లు దాటితే) సహ ఆచార్యుడిగా పదోన్నతులు పొందేలా ఉండగా.. తాజా ఉత్తర్వుల్లో దాన్ని సవరిస్తూ సహ ఆచార్యులు, ఆచార్యులకు కూడా వర్తింపజేశారు. దీంతో ఇప్పుడు సహ ఆచార్యుడిగా మూడేళ్లు పూర్తి కాగానే ఆచార్యుడిగా పదోన్నతి లభించాలి. ఒకవేళ ఖాళీలు లేకపోతే.. సహ ఆచార్యులకు మూడేళ్లు పూర్తికాగానే ఒక ఆర్థిక ప్రయోజనం కల్పించడం ద్వారా వారి వేతనాల్లోనూ మార్పు లభిస్తుంది. ఆ తర్వాత మరో మూడేళ్ల తర్వాత కూడా ఖాళీలు లేకపోతే డిజిగ్నేటెడ్‌ ఆచార్యుడిగా పదోన్నతి కల్పిస్తారు. ఒకవేళ ఈలోపు ఖాళీలు ఏర్పడితే మూడేళ్ల తర్వాత ఎప్పుడైనా ఆచార్యుడిగా పదోన్నతి పొందొచ్చు. ఆచార్యులకు కూడా నిర్ణీత కాలం(నాలుగేళ్ల తర్వాత) ప్రకారం వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత మరో ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల తెలంగాణ ప్రభుత్వ బోధనాసుపత్రుల సంఘం సీఎం కేసీఆర్‌కు, వైద్య మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని