సఫాయి కార్మికుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?

ప్రతిపాదనలతో రండి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: సఫాయి కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రతిపాదనలతో రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, జీహెచ్‌ఎంసీకి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురుగుకాల్వల్లో దిగి శభ్రం చేస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లింపుతోపాటు, వారి సంక్షేమానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలపై స్పష్టమైన నిర్ణయాన్ని న్యాయస్థానానికి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. రాష్ట్రంలోని సఫాయి కార్మికుల స్థితిగతులు, పునరావాసంపై సర్వే నిర్వహించడంతోపాటు వారి సంక్షేమానికి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎస్‌.జీవన్‌కుమార్‌ 2013లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ వాదనలు వినిపిస్తూ సఫాయి కార్మికుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదన్నారు. సఫాయి కార్మికులను గుర్తించడానికి నగరాలు, జిల్లాలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, పంచాయతీల్లో సర్వే నిర్వహించాలని ముంబయి, మద్రాసు, కర్ణాటక హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను విన్న ధర్మాసనం సఫాయి కార్మికుల సంక్షేమ చర్యలపై పూర్తి వివరాలతో వాదనలు వినిపించాలంటూ విచారణను సెప్టెంబరు 7వ తేదీకి వాయిదా వేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని