ఆర్‌ఐని నిర్బంధించిన గ్రామస్థులు

తూప్రాన్‌, న్యూస్‌టుడే: భూసేకరణ విషయమై గ్రామస్థులతో సమావేశం నిర్వహించేందుకు వచ్చిన అధికారిని వారు పంచాయతీ కార్యాలయంలో గంటపాటు నిర్బంధించారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇమాంపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ ఉన్న సర్కారు స్థలాలను ఇటీవల ప్లాట్లుగా చేసి విక్రయిస్తుంది. ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇమాంపూర్‌లో ఒకే సర్వే నంబరులో ఉన్న 100 ఎకరాలకుపైగా ఎసైన్డ్‌ భూమిని సేకరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారులు సర్వే ప్రారంభించారు. గురువారం గ్రామస్థులతో సమావేశం నిర్వహించేందుకు తూప్రాన్‌ ఆర్‌ఐ నగేశ్‌ పంచాయతీ కార్యాలయం వద్దకు రాగానే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమినే సాగు చేసుకొని జీవిస్తున్నామని, దీన్ని తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లగానే బయటి నుంచి గడియపెట్టారు. గ్రామం మొత్తంలో 540 ఎకరాల భూమి ఉంటే అందులో 200 ఎకరాలు ఎసైన్డ్‌ భూమి ఉందన్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ భూ సేకరణకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే బలవన్మరణాలకు పాల్పడుతామని హెచ్చరించారు. ఆర్డీవో శ్యాంప్రకాష్‌ సెల్‌ఫోన్‌ ద్వారా గ్రామస్థులతో మాట్లాడి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఆర్‌ఐని వదిలిపెట్టారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని