దుబాయ్‌ విమానంలో సాంకేతిక లోపం

340 మంది ప్రయాణికులు 10 గంటలు శంషాబాద్‌ విమానాశ్రయంలో పడిగాపులు

శంషాబాద్‌,న్యూస్‌టుడే: దుబాయ్‌ వెళ్లేందుకు ఓ విమాన సర్వీస్‌ రన్‌వే పైకి వెళ్లింది. గాల్లోకి ఎగరడానికి సమాయత్తం అవుతుండగా.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్‌ గమనించి వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కేంద్రానికి సమాచారం అందించారు. ఏటీసీ అధికారులు సర్వీస్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానాశ్రయం అధికారులు, ప్రయాణికులు తెలిపిన కథనం ప్రకారం.. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఈకే-529 విమాన సర్వీస్‌ బుధవారం రాత్రి 10.30 గంటలకు 340 మంది ప్రయాణికులను ఎక్కించుకొని రన్‌వే పైకి వెళ్లింది. సాంకేతిక లోపం తలెత్తడంతో వెనక్కి తీసుకొచ్చారు. తేలికపాటి సమస్య అనుకొని ప్రయాణికులను కిందకు దించకుండానే ఇంజినీరింగ్‌ నిపుణులు రెండు గంటలు శ్రమించారు. సాంకేతిక లోపం సరిచేయడం సాధ్యం కాకపోవడంతో ప్రయాణికులను విమానంలో నుంచి దించేశారు. ఉదయం 10 గంటల వరకు పడిగాపులు కాశారు. చిన్నారులు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా స్పందించిన ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ఉదయం ప్రయాణికులకు హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. 24 గంటలు ఆలస్యంగా.. అంటే గురువారం రాత్రి 10.30 గంటలకు దుబాయ్‌కు విమానం బయల్దేరినట్లు పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని