శెభాష్‌.. శిరీష

కళ్లలో కారం కొట్టినా.. గొలుసు దొంగను వదలని మహిళ

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: కళ్లల్లో కారం కొట్టినా.. కాళ్లకు దెబ్బలు తగిలినా ఆమె పట్టు విడవలేదు. మెడలో గొలుసు లాక్కొని దొంగ బైకుపై పారిపోతుండగా వాహనం వెనక ఆమె గట్టిగా పట్టుకున్నారు. దొంగ ఆమెను అలానే కొద్ది దూరం ఈడ్చుకెళ్లాడు. అతడు పట్టు తప్పి పడిపోగా ఇద్దరు యువకుల సహాయంతో అతణ్ని పోలీసులకు అప్పగించి ఆమె తెగువ చూపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన సండ్ర శిరీష, నగేష్‌ దంపతులు హైదరాబాద్‌ హయత్‌నగర్‌ బాలాజీనగర్‌ రోడ్డు నంబర్‌.6లో నివసిస్తున్నారు. వీరు ఉంటున్న ఇంటి ప్రక్కనే మరో రెండు సింగిల్‌ బెడ్‌రూమ్‌లు ఖాళీగా ఉండడంతో ఇంటి యజమాని భిక్షమయ్య టు-లెట్‌ బోర్డు పెట్టారు.  గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి  మొదటి అంతస్తుకు చేరుకొని అద్దెకు ఇల్లు కావాలంటూ శిరీషను అడిగాడు. ఫ్లాట్‌ చూపించి తాళం వేస్తుండగా అతడు వెంట తెచ్చుకున్న కారాన్ని ఆమె కళ్లలో కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని కిందకు పరుగు తీశాడు. ఆమె అతడిని వెంబడించారు. అతడు బైక్‌ ఎక్కి కదుల్తుండగా ఆమె ద్విచక్రవాహనాన్ని గట్టిగా పట్టుకున్నారు. అలాగే ఈడ్చుకెళ్తున్నా వదలకుండా బైక్‌ను పట్టుకోవడంతో పాటు వెనక్కు లాగడంతో అతడు కిందపడ్డాడు. స్థానికంగా ఉండే ఓ ఇద్దరు యువకులతో కలిసి ఆమె దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బైక్‌ ఈడ్చుకెళ్లడంతో శిరీష మోకాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు బంగారు గొలుసును శిరీషకు అందజేశారు. చోరీ సమయంలో టీషర్టు ధరించిన దొంగ.. పని పూర్తికాగానే కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు వీలుగా వెంట మరో చొక్కా తెచ్చుకున్నాడు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని