ఆహ్లాద వనం.. నిర్వహణ శూన్యం

అటవీశాఖ పార్కుల్లో అసౌకర్యాలు
సైక్లింగ్‌, గుడారాల్లో బస బంద్‌
తాగునీరు కూడా దొరక్క  యాత్రికుల ఇబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: నిత్యం ఒత్తిడితో సతమతమవుతూ ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వన యాత్రికులు అటవీశాఖ ఏర్పాటుచేసిన పార్కుల్లో నెలకొన్న అసౌకర్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పచ్చని చెట్ల మధ్య సైకిల్‌ తొక్కడం, దట్టమైన అడవి మధ్యలో ఏర్పాటుచేసిన గుడారాల్లో రాత్రి బస వంటి వసతులు దూరమయ్యాయి. కొన్నిచోట్లయితే మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి. పట్టణ అటవీ పార్కుల ప్రారంభంలో ఉన్న శ్రద్ధ.. తర్వాత లేకపోవడంతో సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. హైదరాబాద్‌ చుట్టూ నారపల్లిలో నందనవనం, కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కు, పెద్దగోల్కొండలో జంగిల్‌ క్యాంప్‌.. కాళేశ్వరంలో ముక్తివనం, మహబూబ్‌నగర్‌లో మయూరి హరితవనం, చౌటుప్పల్‌లో తంగేడువనం, నర్సాపూర్‌లో అర్బన్‌ పార్కు ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా అనేకం అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కోటి వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యాయి. 

ఐటీ ఉద్యోగులు దూరం

మహబూబ్‌నగర్‌ శివారులోని మయూరి హరితవనంలో ప్రత్యేకతలు ఐటీ ఉద్యోగులు సహా చాలామందిని ఆకర్షించేవి. రోజుకు రూ.1,500 చెల్లిస్తే భోజనం, బస ఉండేవి. గుట్టలపై ట్రెక్కింగ్‌, ఇతర సాహస క్రీడలు ఆడుతూ రాత్రి గుడారాల్లో నిద్రించేవారు. ఆ వసతిని అటవీశాఖ నిలిపివేసింది. దీంతో రోజుకు 1,200 నుంచి అయిదారొందలకు పడిపోయింది. రైలు, బోటింగ్‌, సైక్లింగ్‌ ఉన్నాయి.


పనిచేయని సైకిళ్లు, కుళాయిలు

నారపల్లి నందనవనంలో 30 సైకిళ్లుండేవి. సందర్శకులు సైకిల్‌పై సరదాగా తిరుగుతూ అడవంతా చుట్టేసి వచ్చేవాళ్లు. ఆ సేవల్ని నిలిపివేయడంతో ఒకటిన్నర, రెండు కిలోమీటర్లు కాలినడకన తిరగాల్సి వస్తోంది. ఫిల్టర్‌ చెడిపోవడంతో మంచినీళ్లూ దొరకని పరిస్థితి. గతంలో రోజుకు 6వేల మంది వరకు వచ్చేవారు. ఇప్పుడు గరిష్ఠంగా 1,800 మందికి మించట్లేదు.


మూడు నెలల ముచ్చటే

పెద్దగోల్కొండ పక్కన ఓఆర్‌ఆర్‌ సమీపంలో జంగిల్‌ క్యాంప్‌... హైదరాబాద్‌వాసులకు అడ్వెంచర్‌ పార్కు. ఈ పార్కులో వాకింగ్‌, 5 కి.మీ. సైక్లింగ్‌ ట్రాక్‌తో పాటు.. తాళ్ల ఉయ్యాలపై నడక, విలువిద్య, గోడలు ఎక్కడం, తాడుకు వేలాడుతూ 150 మీటర్ల దూరం వరకు వెళ్లడం వంటి సాహస క్రీడలతో పాటు కుటుంబంతో రోజంతా గడిపేందుకు గుడారాలు ఏర్పాటుచేశారు. వీటిని ప్రారంభించిన మూణ్నెల్లకే కరోనా కారణంగా మూసివేశారు. రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయి’ అని ఓ అధికారి తెలిపారు.


1.5 కి.మీ నడవాల్సిందే..

నగరానికి చేరువగా ఉన్న నర్సాపూర్‌ అటవీపార్కుకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుతోంది. అతిథిగృహాల నిర్మాణంలో ఆలస్యమే కారణం. కాళేశ్వరంలో 50 ఎకరాల్లో ముక్తివనం పార్కులో పిల్లలు ఆడుకునే పరికరాలు పాడయ్యాయి. బెంచీల చుట్టూ చెట్లు ఉన్నాయి. ట్రాక్‌ సైకిళ్లు అందుబాటులో లేకపోవడంతో యాత్రికులు 1.5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. పార్కుకు ఆదాయం లేక, జీతాలివ్వలేక తాత్కాలిక సిబ్బంది రావడంలేదు.


 


మరిన్ని

ap-districts
ts-districts