ఐటీ కళకళ.. అప్పుడే కాదు

హైబ్రిడ్‌ పనివిధానాన్ని పొడిగిస్తున్న సంస్థలు
ఈ ఏడాది చివరి వరకూ ఇదే పరిస్థితి!

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఐటీ సంస్థలు ఉద్యోగులతో కళకళలాడేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. గతంతో పోలిస్తే కరోనా తగ్గుముఖం పట్టినా అత్యధిక సంస్థలు ఉద్యోగుల్ని పూర్తిస్థాయిలో కార్యాలయానికి పిలవడం లేదు. వాస్తవానికి జులై చివరి నాటికే ఐటీ కంపెనీలు ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశాయి. మారిన పరిస్థితులతో ఇది సాధ్యం కావడం లేదు. ఎక్కువమంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయంలో పనిచేసేందుకు విముఖత వ్యక్తం చేయడం, కరోనా నేపథ్యంలో కొన్ని సంస్థలు కార్యాలయ ప్రాంగణాన్ని కుదించడం, ఒకేసారి అందరితో పనిచేయించే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణాలు. ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్‌ పనివిధానాన్ని పొడిగిస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకూ ఇదే పరిస్థితి ఉండే అవకాశముందని ఐటీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో పూర్తిస్థాయిలో ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించిన సంస్థల్ని వేళ్లపై లెక్కించొచ్చని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. నగరంలోని ఐటీ సంస్థల్లో దాదాపు 7.78 లక్షల మంది పనిచేస్తున్నారు. కరోనాతో దాదాపు రెండేళ్లపాటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించాయి. దీంతో కొందరు సొంతూళ్లకు వెళ్లిపోయి పనిచేశారు. వారికి రవాణా, ఇంటిఅద్దె, ఇతర ఖర్చుల భారమూ తప్పింది. దీంతో కార్యాలయాలకు వచ్చి పనిచేయడానికి ఎక్కువమంది ఇష్టపడడం లేదు. అవసరమైతే ఉద్యోగాన్ని వదులుకునేందుకు కొందరు వెనుకాడడం లేదు. దీంతో మధ్యేమార్గంగా హైబ్రిడ్‌ పనివిధానాన్ని సంస్థలు పొడిగిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇంటి నుంచి పనిచేసే రోజుల్ని రెండు నెలలకోసారి కుదిస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్‌లోని ఓ బహుళజాతి సంస్థ జులైలో వారానికి రెండు రోజులు కార్యాలయానికి రావాలని సమాచారమిచ్చింది. ఈ నెల నుంచి దాన్ని 3రోజులకు పెంచింది. విశాలమైన భవనాల్లో ఎక్కువ అంతస్తుల్లో కార్యాలయాలు ఏర్పాటుచేసిన సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చిన నేపథ్యంలో ప్రాంగణాన్ని కుదించుకున్నాయి. ఆయా భవనాలను యజమానులు ఇతరులకు అద్దెకిచ్చాయి. వాటిని తిరిగి అద్దెకు తీసుకోవాలన్నా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఉద్యోగుల్ని పిలిపిస్తే కార్యాలయం సరిపోదన్న ఉద్దేశంతో కొన్ని సంస్థలు మరికొన్ని నెలలు వాయిదా వేయాలని భావిస్తున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts