సంక్షిప్త వార్తలు

‘ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’

ఈనాడు, హైదరాబాద్‌: చట్ట విరుద్ధంగా.. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ గ్రామ రెవెన్యూ అధికారులను (వీఆర్వో) బలవంతంగా ఇతర శాఖల్లోకి బదిలీ చేయడం పూర్తిగా ధర్మవిరుద్ధమని వీఆర్వో ఐకాస అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌ సోమవారం పేర్కొన్నారు. కొందరు ఉన్నతాధికారులు సీఎంను, ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వీఆర్వోలను బదిలీ చేశారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జీవో 121 చెల్లదని స్పష్టం చేశారు. అధికారుల ఒత్తిడితోనే కొందరు ఇతర శాఖల్లో చేరారన్నారు.


గిరిజన భాషల ఆంగ్లమాధ్యమ పుస్తకాలు సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: ఆదివాసీ గిరిజన ప్రజలకు సొంత భాషల్లో చదువు చెప్పేందుకు వీలుగా గిరిజన సంక్షేమశాఖ మాతృభాషలో పుస్తకాలు రూపొందిస్తోంది. గతంలో ఒకటోతరగతి పాఠ్యాంశాల బోధనకు తెలుగు మాధ్యమ పుస్తకాలను ఎరుకల, గోండు, కోయ, కొలామి, బంజారా భాషల్లోకి అనువదించింది. తాజాగా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసింది. ఈ పుస్తకాలను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం సంక్షేమభవన్‌లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆవిష్కరించనున్నారు.


జూనియర్‌ కళాశాలలుగా నాలుగు బీసీ గురుకులాలు

నాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నాలుగు బీసీ గురుకుల పాఠశాలల్ని జూనియర్‌ కళాశాలలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌జిల్లా తిమ్మాపూర్‌, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, హన్మకొండ జిల్లా కమలాపూర్‌ బాలికల బీసీ గురుకుల పాఠశాలలు, జయశంకర్‌భూపాలపల్లిలోని మొగుళ్లపల్లి బాలుర బీసీ గురుకుల పాఠశాలను జూనియర్‌ కళాశాలగా ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు తరగతులు నిర్వహించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని బీసీ గురుకుల సొసైటీని ఆదేశించింది.


కొత్తగా 528 కరోనా కేసులు
దుబ్బాక ఎమ్మెల్యేకు కొవిడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం కొత్తగా 528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,26,284కు చేరుకుంది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 196 కేసులు వచ్చాయి. సోమవారం 771మంది కోలుకోవడంతో కోలుకున్న వారిసంఖ్య 8,16,506కి చేరింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు సోమవారం నిర్వహించిన పరీక్షలో కరోనా నిర్ధారణ అయ్యింది.


జేఈఈ మెయిన్‌లో  శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు సత్తాచాటారని ఆ విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ సోమవారం తెలిపారు. జాతీయ స్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో మొదటి పదిలోపు 4 ర్యాంకులు, 100లోపు 22, వెయ్యిలోపు128, అన్ని కేటగిరీల్లో వెయ్యిలోపు 601 ర్యాంకులు పొందినట్లు పేర్కొన్నారు.

నారాయణ విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్‌లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో తొలి 10లోపు 3, వందలోపు 19, అన్ని కేటగిరీల్లో కలిపి వెయ్యిలోపు 571 ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు.

ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ విజయం

జేఈఈ మెయిన్‌లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు అన్ని కేటగిరీల్లో కలిపి జాతీయ స్థాయిలో 3, 18, 21, 29, 52, 158, 173, 186, 188, 219, 240, 284, 287, 290, 309 ర్యాంకులు సాధించారని సంస్థ ఛైర్మన్‌ ఎ.వరదారెడ్డి తెలిపారు.

అల్ఫోర్స్‌కు ర్యాంకుల పంట

జేఈఈలో అల్ఫోర్స్‌ విద్యార్థులు జాతీయ స్థాయిలో 242, 375, 487, 577, 597, 607, 673, 730, 845 ర్యాంకులు, 28 మంది విద్యార్థులు 5,000లోపు ర్యాంకులు పొందినట్లు ఆ విద్యా సంస్థల ఛైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు.

డా.కేకేఆర్‌ గౌతమ్‌ మెరుపులు

జేఈఈలో డా.కేకేఆర్‌ గౌతమ్‌ పూర్వ విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల ప్రిన్సిపల్‌ తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో 100లోపు 4 ర్యాంకులు, అన్ని కేటగిరీల్లో కలిపి 100లోపు 23 ర్యాంకులు సాధించారన్నారు.  


‘తపాలా ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం’

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: తపాలా శాఖను కేంద్రం ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఆ శాఖ ఉద్యోగులు దేశ వ్యాప్తంగా ఈ నెల 10న చేపట్టనున్న సమ్మెకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమన్వయ కమిటీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాఖ మద్దతు ప్రకటించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల వద్ద నిరసన వ్యక్తం చేస్తామని కమిటీ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి ఎ.అజీజ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని