Venkaiah naidu: స్ఫూర్తిప్రదాత వెంకయ్య

రాజ్యసభ నిర్వహణలో నూతన ప్రమాణాలు నెలకొల్పారు

ఉప రాష్ట్రపతిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

వెంకయ్యనాయుడుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అగ్రనేతలు

వీడ్కోలు కార్యక్రమాల్లో ఉప రాష్ట్రపతి భావోద్వేగం

నేను ఎప్పుడూ రాష్ట్రపతి పదవిని కోరుకోలేదు. అసమ్మతి గళం లేవనెత్తబోను. రాజకీయాల్లో కొనసాగను. కానీ ప్రజలతో మాట్లాడుతుంటా. వారితో మమేకమవుతుంటా. విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట పెరుగుతుంది. 

-వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: అయిదేళ్లుగా ఉప రాష్ట్రపతి పీఠంపై కొనసాగుతూ దేశానికి వెంకయ్యనాయుడు చేసిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు అగ్ర నేతలు వేనోళ్ల పొగిడారు. రాజ్యసభకు ఆయన నేతృత్వం వహించిన తీరుకు జేజేలు పలికారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఉప రాష్ట్రపతి దాకా ఆయన ఎదిగిన తీరు భావితరాలకు స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించారు. అకుంఠిత దీక్షాదక్షతలతో.. పనిచేసిన ప్రతిచోటా ఆయన తనదైన ముద్ర వేశారంటూ కితాబిచ్చారు. వెంకయ్యనాయుడి నిబద్ధత, సమయపాలన, వాక్చాతుర్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఈ నెల 10న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాజ్యసభలో, స్థానిక జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో సోమవారం ప్రత్యేకంగా వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు అందులో పాల్గొని ప్రసంగించారు. తనపై నేతల ప్రశంసల వర్షానికి కృతజ్ఞతలు తెలిపిన వెంకయ్యనాయుడు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కీలక సూచనలు చేశారు. జాతి నిర్మాతలు నిర్దేశించిన ప్రమాణాలకు కట్టుబడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. తనకు ఏడాది వయసున్నప్పుడే తన తల్లి మరణించిన సంగతి ప్రస్తావనకు వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు కన్నీటిపర్యంతమవడం సభికులను భావోద్వేగానికి గురిచేసింది.

భుజం భుజం కలిపి పనిచేశా

‘‘వెంకయ్యనాయుడు తన ప్రతిభాపాటవాలతో రాజ్యసభ నిర్వహణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఇకపై ఆ పదవిలోకి వచ్చేవారు వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాల్సి ఉంటుంది. అభివ్యక్తీకరణ కళలో వెంకయ్యనాయుడికి ఉన్న ప్రావీణ్యం గురించి పార్లమెంటు లోపల, బయట అందరికీ తెలుసు. ఆయన మాటల్లో లోతు, గంభీరత, చతురత, విజ్ఞానం.. అన్నీ ఉంటాయి. వెంకయ్యనాయుడిని విభిన్న పాత్రల్లో చాలా దగ్గరి నుంచి చూసే అవకాశం రావడం నా అదృష్టం.  ఆయనతో భుజం భుజం కలిపి పనిచేశాను కూడా. పార్టీ కార్యకర్తగా ఆయన చూపిన నిబద్ధత, శాసనసభ్యుడిగా పనితీరు, పార్లమెంటు సభ్యుడిగా సభలో ప్రదర్శించిన క్రియాశీలత, భాజపా అధ్యక్షుడిగా ప్రదర్శించిన నాయకత్వ కౌశలం,  మంత్రి రూపంలో పడ్డ శ్రమ, నవకల్పనల కోసం తపించిన తీరు.. ఇవన్నీ దేశానికి ఎంతో మేలు చేశాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి

‘‘ఎన్ని విభేదాలు, వైరుద్ధ్యాలు ఉన్నా మనమంతా భారతీయులం. ప్రజాస్వామ్యంలో మనకు ఓర్పు ఉండాలి. ఎదుటివారి అభిప్రాయాన్ని ఆలకించాలి. ప్రజాతీర్పును సహించే ఓపిక ఉండాలి.   ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నా.. ప్రతిపక్షానికి చెప్పే అవకాశం ఇవ్వాలి. నన్ను ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేశామని ఐదేళ్ల కిందట ప్రధాని ప్రకటించినప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ పదవిని నేను అడగలేదు.  పార్టీ అప్పగించిన బాధ్యతలను శిరసావహిస్తూ భాజపాకు రాజీనామా చేశాను. నాకు ఇంతటిస్థాయి ఇచ్చిన పార్టీకి రాజీనామా చేయాల్సి రావడం కన్నీళ్లు తెప్పించింది. ఒకప్పుడు జట్కాలో ఊరంతా తిరుగుతూ.. వాజ్‌పేయీ సమావేశాల గురించి మైక్‌లో ప్రచారం చేసేవాణ్ని. పోస్టర్లు అతికించేవాడిని. అలాంటి నేను భాజపా అధ్యక్షుడినై వాజ్‌పేయీ, ఆడ్వాణీల మధ్య కూర్చుంటానని కలగనలేదు’’ అని వెంకయ్య నాయుడు చెప్పారు.

ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత 

‘వెతికితే ఎవరో ఒకరు దొరుకుతారేమోకానీ వెంకయ్యనాయుడి లాంటివారు దొరకరు! ఆయన పదవీ విరమణ తర్వాత రాజ్యసభలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. ఇకపై కూడా వెంకయ్యనాయుడు ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటారని భావిస్తున్నాను. ప్రజాస్వామ్యం, సమానత్వం, రాజ్యాంగ మూల సిద్ధాంతాలపై యువతకు ఆయన మార్గదర్శనం చేస్తూనే ఉండాలి’. 

జైరాం రమేశ్, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి 

‘జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి వచ్చినప్పటికీ.. వెంకయ్యనాయుడు రాజ్యసభ ఛైర్మన్‌గా తీసుకొనే నిర్ణయాలపై ఆ ప్రభావం పడనివ్వలేదు. ఆయన నిర్ణయాలు అర్థంకాక అధికార పార్టీ సభ్యులు మా వద్దకు వచ్చి అడిగిన సందర్భాలున్నాయి. దాన్ని బట్టి ఆయన అందర్నీ ఒకేలాచూశారని అర్థమవుతోంది’. 


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని