TS Police: కానిస్టేబుళ్ల రాత పరీక్ష 28కి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెల 21వ తేదీన జరగాల్సిన కానిస్టేబుళ్ల ప్రాథమిక రాత పరీక్ష 28వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 మంది కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించి నియామక మండలి గత ఏప్రిల్‌లో ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సై ఉద్యోగాలకు ఈ నెల 7వ తేదీన పరీక్ష నిర్వహించగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈ నెల 21వ తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ముందు ప్రకటించారు. పరిపాలనాపరమైన సమస్యల కారణంగా ఆగస్టు 28కి వాయిదా వేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి హాల్‌టికెట్లను ఈ నెల 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని నియామక మండలి ఛైర్మన్‌ తెలిపారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్‌ సహా 40 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని