Diamond jubilee Celebrations: జయతు జయతు భారతం.. ఎల్లెడలా ఉత్సాహం

ఘనంగా వజ్రోత్సవాలు ప్రారంభం

హెచ్‌ఐసీసీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. కార్యక్రమాలకు సీఎం శ్రీకారం 

మండల స్థాయి మండలి వరకూ హాజరైన ప్రజాప్రతినిధులు, ఎంపీలు

కళ్లు చెదిరేలా కళా ప్రదర్శనలు

హెచ్‌ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌, వేదికపై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి, గంగుల, మేయర్‌ విజయలక్ష్మి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, తెరాస లోక్‌సభాపక్ష నేత నామా, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని, ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి, మల్లారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు హైదరాబాద్‌ అంతర్జాతీయ సమావేశ కేంద్రం (హెచ్‌ఐసీసీ)లో సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేదిక వద్ద పోలీసు దళాల గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి.. వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహానీయుల వీరగాథల్ని గుర్తుచేస్తూ.. వివిధ కళారూపాలతో మహాత్మా గాంధీ సహా నాటి పోరాటయోధుల చరిత్రలను ప్రదర్శించారు. వేదికపై సీఎంతో పాటు వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, ఎంపీ కేశవరావు, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఆశీనులయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌, డీసీసీబీ, రైతుబంధు సమితుల అధ్యక్షులు, మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు, జడ్పీటీసీలు, మండల పరిషత్‌ ఛైర్‌పర్సన్లు తరలివచ్చారు.

వీణావాయిద్య కచేరితో ఆరంభం

తొలుత వేదికపై దేశభక్తి గీతాలతో 75 మంది కళాకారులు వీణావాయిద్య కచేరి నిర్వహించారు. ఆ తర్వాత ఇసుక కళతో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను ప్రదర్శించారు. అలేఖ్య పుంజాల నేతృత్వంలో తమిళ రాణి వేలు నచియార్‌, ఝాన్సీ లక్ష్మీబాయి, లక్ష్మిసెహగల్‌ తదితర యోధురాళ్లు ఆంగ్లేయులను ఎదుర్కొన్న తీరును కళాకారులు కళ్లకు కట్టినట్లు చూపారు. జయతు జయతు భారతం.. వసుధైక కుటుంబకం అంటూ సాగిన నాట్య విన్యాసం ఆనాటి స్వాతంత్య్ర కాంక్షలను చాటింది.

ఇది స్వాతంత్య్రం అంటే...

నటుడు ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానంతో తెలంగాణ స్వయంసమృద్ధి ఫలాలను తెలియజేస్తూ ‘ఇదీ స్వాతంత్య్రమంటే’అంటూ మరో లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. అందులో కాళేశ్వరం, ఆసరా పింఛన్లు, రైతుబంధుసాయం, ఉచిత విద్యుత్‌, రెండుపడక గదుల ఇళ్లు, యాదాద్రి, కొత్త కలెక్టరేట్ల నిర్మాణం తదితరాలను తెలియజేస్తూ గత ఎనిమిదేళ్ల తెలంగాణ అభివృద్ధిని చూపించారు. కళాచిత్ర ప్రదర్శనలను సీఎం కేసీఆర్‌, ఇతర ప్రముఖులు తిలకించారు. కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు.

స్ఫూర్తిని చాటేందుకే: కేశవరావు

స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తిని నలుదిశలా చాటేందుకే వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఇది ఎవరికీ పోటీ కాదని.. కళాప్రదర్శనల అనంతరం నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కేశవరావు తెలిపారు. తెలంగాణలో జరిగిన గొప్ప కార్యక్రమాల్లో ఒకటిగా ఈ ఉత్సవాలు నిలిచిపోతాయన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్‌ వంటి నేతలు స్వాతంత్య్ర ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని