విద్యుత్‌ సవరణ బిల్లుపై పోరాడతాం

 మా ఆందోళనలతోనే కేంద్రం వెనక్కు తగ్గింది
 మహా ధర్నాలో విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు

ఈనాడు, హైదరాబాద్‌, ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘాలు సోమవారం సోమాజిగూడ విద్యుత్‌సౌధ వద్ద మహాధర్నా నిర్వహించాయి. భాజపా మినహా పలు పార్టీల నేతలు దీనికి హాజరయ్యారు. ఉద్యోగుల పోరాటానికి మద్దతు పలికారు. వర్షం పడుతున్నా ఉద్యోగులు నిరసన కొనసాగించారు.

* విద్యుత్‌ చట్టసవరణ బిల్లు ప్రజలు, రైతులకు ప్రమాదకరమని, కార్పొరేట్‌ సంస్థలకే లాభమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఈ బిల్లు ఆమోదంతో భవిష్యత్తులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రమాదముందన్నారు. మరోవంక.. విద్యుత్‌ చట్టసవరణ బిల్లును స్థాయీ సంఘానికి పంపిన నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనలు విరమించి విధుల్లో చేరాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కోరారు.

* కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశ జాతీయ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చట్ట సవరణపై  వెనక్కు తగాల్సిందేనన్నారు. లేదంటే ఉద్యోగుల పక్షాన పోరాతామన్నారు. సీపీఐ నేత వీఎస్‌బోస్‌, సీఐటీయూ నేత సాయిబాబు మాట్లాడుతూ.. మోదీ సర్కారు తొలిసారిగా విద్యుత్తు సవరణ బిల్లును స్థాయీ సంఘానికి పంపడానికి విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళనే కారణమన్నారు. బిల్లు పెట్టి చట్టం చేస్తామంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. ఐకాస నేతలు సాయిబాబు, రత్నాకర్‌రావులు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రతిఘటనతోనే స్టాండింగ్‌ కమిటీకి పంపారన్నారు.
* విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ విద్యుత్తు అకౌంట్స్‌ అధికారుల సంఘం విడిగా మింట్‌ కాంపౌండ్‌లో ధర్నా చేపట్టింది. బిల్లు పరంగా కేంద్రం తీరును సంఘం ప్రధాన కార్యదర్శి అంజయ్య తప్పుబట్టారు.

ఉద్యోగులకు అండగా తెరాస ప్రభుత్వం

విద్యుత్తు బిల్లును అడ్డుకునే ఉద్యోగులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస కన్వీనర్‌ శివాజీ అధ్యక్షతన విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. అతిథిగా హాజరైన రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లు చట్టంగా మారితే రాష్ట్రాలు ప్రజల అవసరాలు తీర్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్‌ నేత మల్లు రవి, జాతీయ కిసాన్‌ కాంగ్రెస్‌ నేత కోదండరెడ్డి, ఐకాస ఛైర్మన్‌ కోడూరి ప్రకాష్‌, రైతుసంఘం నేత పశ్యపద్మ తదితరులు మాట్లాడారు.

* విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఈగలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రం ఉద్యోగులు సోమవారం విధులు బహిష్కరించి మహాధర్నా నిర్వహించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని