భారతీయ సంప్రదాయ నృత్యం.. ‘4డీ’లో పదిలం!

 మెటావర్స్‌లోకి తీసుకువచ్చేందుకు అడుగులు

ట్రిపుల్‌ఐటీ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం కసరత్తు

ఈనాడు - హైదరాబాద్‌

భరతనాట్యం.. మోహినీఆట్టం.. కథక్‌.. భారతీయ సంప్రదాయ నృత్యరీతులివి. వాటిని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టు చేపట్టింది. ఆయా నృత్యరీతులకు సంబంధించి 4డీ వీడియోలు చిత్రీకరించి పదిలపరుస్తున్నారు. ట్రిపుల్‌ఐటీలో సెంటర్‌ ఫర్‌ విజువల్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(సీవీఐటీ) ఆధ్వర్యంలో ఈ కసరత్తు జరుగుతోంది.

ఎలా రూపొందిస్తారంటే..!

ఇప్పటికే మనిషి కదలికలను ఒడిసిపట్టే సాంకేతికతను గేమింగ్‌, వీఆర్‌ అవతార్స్‌, యానిమేషన్‌ రంగంలో విరివిగా వినియోగిస్తున్నారు. తాజాగా మెటావర్స్‌ సాంకేతికతను జోడించి ఆయా నృత్యరీతులను రికార్డింగ్‌ చేయనున్నారు. 3డీ యానిమేషన్‌లో ఒక మనిషి ఇచ్చే సిగ్నల్స్‌ లేదా సంజ్ఞల ఆధారంగానే రికార్డు చేసే వీలుంటుంది. మెటావర్స్‌లో మనిషి అవసరం లేకుండా కదలికలను గుర్తించొచ్చు. కసరత్తులో భాగంగా సీవీఐటీలోని ప్రొ.అవినాష్‌శర్మ బృందం తొలుత నృత్యరీతుల వీడియోలు తయారు చేస్తోంది. తర్వాత సంప్రదాయ దుస్తులు, నగలను జత చేయనున్నారు. ఇందుకుగాను ముందస్తుగా 3డీ స్కానర్‌ సాయంతో 250 మందికి చెందిన వివిధరకాల వస్త్రధారణ రీతులతో 3డీ హ్యుమన్స్‌ పేరిట డేటాను రూపొందించారు. దీనిసాయంతో మనిషికి చెందిన 3డీ అవతార్‌ సృష్టించి.. దాని నుంచి మెటావర్స్‌లోకి తీసుకువచ్చి నృత్య కదలికలను రికార్డు చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. కళాకారుల ప్రదర్శనలు, హావభావాలు, ముద్రలు పూర్తిస్థాయిలో రికార్డు చేయడంతో ఆన్‌లైన్‌లో ఎక్కడినుంచైనా చూసేందుకు వీలుపడుతుంది. ‘‘2డీ వెర్షన్‌లో కెమెరా ఒకేచోట ఉంచి ముద్రలు, హావభావాలు రికార్డు చేసేందుకు సరిగా రావు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 4డీ సాంకేతికత సాయంతో చిత్రీకరిస్తున్నాం. దుస్తుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దుస్తులు సరిగా జతయ్యేలా సాంకేతికత రూపొందించి భవిష్యత్తులో మార్కెట్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని ప్రాజెక్టు ఇన్‌ఛార్జి ప్రొ.అవినాష్‌ శర్మ వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని