ఆదివాసీలకు అండగా సీఎం కేసీఆర్‌

మంత్రి సత్యవతి రాథోడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని విధాలా అండగా ఉన్నారని గిరిజన, మహిళా సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులను సత్కరించి నగదు పురస్కారాలు అందించారు. చెంచు, కొలం, తోటి, కొండరెడ్డి కుటుంబాల ఆరోగ్య పోషణ, జీవనోపాదుల పెంపుదల కోసం రాజేంద్రనగర్‌ పౌల్ట్రీ రీసెర్చ్‌ కేంద్రంతో గిరిజన సంక్షేమ శాఖ అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి 20 కోళ్ల చొప్పున ఐటీడీఏ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివాసీల గుస్సాడి, కళాకారుల నృత్య, విద్యార్థుల నాటక ప్రదర్శనలతో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం కన్నుల పండువగా సాగింది. కార్యక్రమంలో గిరిజన కోపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ రమావత్‌ వాల్య నాయక్‌, గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఇస్లావత్‌ రామచంద్రనాయక్‌, పద్మశ్రీ కనకరాజు, పద్మశ్రీ సకిన రామచంద్రయ్య, క్రిస్టినా జెడ్‌ చోంగ్తు, సర్వేశ్వర్‌ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts