అద్దె ఇళ్లలోనే అంగన్‌వాడీలు

12వేలకు పైగా కేంద్రాలకు సొంత భవనాలు కరవు

ఉన్నవీ శిథిలావస్థలోనే

పట్టాలెక్కని అంగన్‌వాడీల ఆధునికీకరణ

ఇది మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలోని కొత్తపల్లి అంగన్‌వాడీ కేంద్రం. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి టీచర్‌, వర్కర్‌ విధులు మానేయడంతో మరో గ్రామ టీచర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ కేంద్రం పరిధిలో 20 మంది లబ్ధిదారులు ఉన్నారు. గోడలు బీటలువారి, కూర్చునేందుకూ చోటులేక బాలలు ఇబ్బంది పడుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి. ప్రభుత్వ భవనాల నిర్వహణ సరిగాలేక కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరాయి.. ఇప్పటికీ భవన నిర్మాణాలు పూర్తికాని కేంద్రాలన్నీ కనీస వసతుల్లేని అద్దెగూళ్లలో సాగుతున్నాయి. వీటిలో చదువుకునేందుకు వచ్చే చిన్నారులు, పోషకాహారం కోసం వచ్చే బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. వర్షం వస్తే నేలపై కూర్చోలేని దుస్థితి. రాష్ట్రంలో దాదాపు 34శాతం అంగన్‌వాడీలు నేటికీ అద్దెభవనాల్లోనే నడుస్తున్నాయి. వాటికి ఉపాధిహామీ పథకం కింద శాశ్వత భవనాలు నిర్మించేందుకు నిర్ణయించినా ఆచరణ సాధ్యం కాలేదు. కేరళ తరహాలో అంగన్‌వాడీలను అభివృద్ధి చేస్తామన్న హామీలు అమలుకు నోచలేదు. అద్దెభవనాల భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే 5వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల ప్రాంగణాల్లోకి మార్చారు. జనావాసాలకు దూరంగా ఉన్న వాటి చెంతకు వెళ్లలేక గర్భిణులు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారు.

రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో బాలింతలు, గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలు దాదాపు 23లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాల్లో ఉన్నా ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. వాటిని ఖాళీచేసి కొన్నిచోట్ల అద్దెభవనాల్లో కేంద్రాల్ని నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000, పట్టణాల్లో రూ.4వేలు, నగరాల్లో రూ.6వేల చొప్పున అద్దె చెల్లిస్తోంది. ఇలా ఇస్తున్న అద్దెలు ఏ మూలకూ సరిపోక, అరకొర సౌకర్యాల నీడన నెట్టుకురావాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అంగన్‌వాడీ సిబ్బంది సొంతగా ఖర్చులను భరించాల్సి వస్తోంది.

పూర్తికాని నిర్మాణాలు..

ఉపాధిహామీ కింద రాష్ట్రంలో 2,734 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి కేంద్రం అనుమతించగా నేటికి 848 పూర్తయ్యాయి. గ్రామాల్లో అనువైన స్థలాలు లేకపోవడంతో పాటు, ఉపాధిహామీ కింద ఇతర పనులు చేపట్టడంతో మిగతా 1,886 అంగన్‌వాడీల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో కొత్త కేంద్రాలు మంజూరు చేయాలని మహిళా శిశుసంక్షేమశాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అంగన్‌వాడీలను సమీప ప్రభుత్వ, పరిషత్‌ పాఠశాలలకు మార్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అద్దెభవనాల్లోని కేంద్రాలకు బదిలీల్లో తొలిప్రాధాన్యం ఇవ్వాలని, బడిలోనే ఒక గదిని అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించాలని తెలిపింది. ఒకేగదిలో వంట, పిల్లలకు ఆటపాటలు సాధ్యం కాదని, బాలింతలు, గర్భిణులు దూరంగా ఉన్న పాఠశాలలకు రాలేరని శిశు సంక్షేమ వర్గాలు వెల్లడించాయి. పాఠశాల ఆవరణలోకి మార్చితే పౌష్టికాహార లక్ష్యం నెరవేరదని అంగన్‌వాడీ సిబ్బంది పేర్కొంటున్నారు.


నారాయణపేట జిల్లా మరికల్‌లోని అంగన్‌వాడీ రెండో కేంద్రమిది. ఇక్కడ 25మంది పిల్లలు శిశువిద్య నేర్చుకుంటున్నారు. పౌష్టికాహారం తీసుకుంటున్నారు. వర్షం వస్తే శ్లాబు నుంచి కారే నీరు వంటగదిలోకి చేరుతోంది. వండిపెట్టడం ఇబ్బంది అవుతోంది. వానొస్తే హాజరు సగానికిపైగా పడిపోతోంది.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని