ఆర్జీయూకేటీలో నిలిచిన విద్యుత్తు సరఫరా

ఇబ్బందులు పడ్డ విద్యార్థులు

ముథోల్‌ (బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు మౌలిక వసతులు లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్న క్రమంలో తాజాగా విద్యుత్తు అంతరాయం వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. విద్యాలయంలోని 132 విద్యుత్తు ఉప కేంద్రంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 4.40 గంటల వరకు దాదాపు 26 గంటలకుపైగా కరెంటు సరఫరా లేక మంచినీరు, కాలకృత్యాలు, ఇతరత్రా అవసరాలకు తీర్చుకోవడానికి విద్యార్థులు అష్టకష్టాలు పడ్డారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన సిబ్బందికి అవగాహన లేక చేతులెత్తేయడంతో విద్యార్థులు రాత్రంతా అంధకారంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్జీయూకేటీ అధికారులు సమస్యను డిస్కం ఎస్‌ఈ జయవంత్‌రావు చౌహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత నిర్మల్‌ నుంచి వచ్చిన ప్రత్యేక ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బంది మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. కరెంటు సరఫరాలో అంతరాయం విషయమై ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ను సంప్రదించగా.. విద్యుత్తు పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని వెల్లడించారు.

అక్కరకు రాని రూ.4 కోట్ల సోలారు ప్లాంటు

మరోపక్క గతంలో ఇక్కడ ఇన్‌ఛార్జి ఉప కులపతిగా పనిచేసిన అధికారి తనకు తెలిసిన కంపెనీతో దాదాపు రూ.4 కోట్లకుపైగా వెచ్చించి విద్యాలయం ఆవరణలో సోలారు ప్లాంటును ఏర్పాటు చేయించినట్లు తెలిసింది. దానికి సంబంధించిన సౌరశక్తి పలకలు పనిచేయడం లేదన్న విషయం తాజా ఘటనతో వెలుగులోకి రావడం విశేషం.


మరిన్ని

ap-districts
ts-districts