TS Govt: అదనపు వనరుల అన్వేషణ!

 సొంత రాబడి పెంపుపై ప్రభుత్వం కసరత్తు
 రుణాలపై కేంద్రం కోతల పర్యవసానం

ఈనాడు, హైదరాబాద్‌: అదనపు వనరుల సమీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో గురువారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అదనపు వనరులను పెంపొందించుకోవడంపై రాబడి శాఖలతో  ప్రత్యేకంగా సమీక్షించనుంది. ప్రధానంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌, రవాణాశాఖల ద్వారా రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల్లో బకాయిల వసూళ్లపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. అలాగే ఆ శాఖల రాబడి అంచనాలను పునఃసమీక్షిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా 2022-23 సంవత్సరానికి రూ.55,530 కోట్ల రుణాలను సమీకరించుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.19 వేల కోట్ల మేర కోత విధించినట్లు ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కాక బడ్జెట్‌ వెలుపల వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.40 వేల కోట్ల రుణాలకు ప్రతిపాదించినా కేంద్ర నిబంధనల నేపథ్యంలో ఈ రుణాలకు అవరోధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం కోసం నిధులు సమస్య లేకుండా చూసుకునేలా అదనపు వనరుల సమీకరణ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి రుణాలు, నిధుల సమీకరణలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపైనా చర్చించడంతో పాటు తదుపరి కార్యాచరణపై సమీక్షించనున్నట్లు తెలిసింది.

అంచనాల మేరకే సొంత రాబడులు

రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్నుల రాబడిని రూ.1.08 లక్షల కోట్లుగా అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో రూ.27,419 కోట్ల రాబడి వచ్చింది. బడ్జెట్‌  అంచనాల మేరకే ఇది 25 శాతం ఉంది. పన్నేతర రాబడిని రూ.25,422 కోట్లుగా అంచనా వేయగా మొదటి మూడు నెలల్లో రూ.6,874 కోట్లు సమకూరింది. ఇది అంచనాల్లో 27 శాతంగా ఉంది. ఈ క్రమంలో భూముల అమ్మకం, గనుల శాఖతో పాటు ఇతర పన్నేతర రాబడిని అంచనాల మేరకు సమకూర్చుకోవడంపై  చర్చించనున్నారు.

నిరాశాజనకంగా గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌

రాష్ట్ర ప్రభుత్వ అంచనాల్లో గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ రూపంలో అందుతున్న మొత్తం తీవ్ర నిరాశాజనకంగా ఉంది. ఈ పద్దు కింద రూ.41,000 కోట్లను అంచనా వేయగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందే మొత్తం రూ.9,443 కోట్లు, జీఎస్టీ పరిహారం రూపంలో రూ.3,000 కోట్లు మినహా ఇతర మొత్తాలు అందే అవకాశాలు లేకుండా పోయాయి.


మరిన్ని

ap-districts
ts-districts