32 లక్షల జాతీయ జెండాల పంపిణీ

 మొదలైన గాంధీ చిత్ర ప్రదర్శనలు

రేపటి నుంచి ఫ్రీడంకప్‌ క్రీడా పోటీలు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే యంత్రాంగం: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ.. చిరుజల్లులతో నేల పులకరిస్తుండగా.. తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను గానం చేస్తూ యావత్‌ భారత జాతి తన్మయత్వం చెందుతోంది. ఈ నెల 15న ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల పతాకం ఎగరవేయాలన్న సంకల్పంతో యంత్రాంగం జెండాలను పంచేపనిలో నిమగ్నమైంది. మంగళవారం 33 లక్షల జాతీయ జెండాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశారు. మహాత్ముడి జీవితాన్ని కళ్లకుకట్టే ‘గాంధీ’ చిత్రాన్ని ఉచితంగా వీక్షించేందుకు చిన్నారులు క్యూ కడుతున్నారు. ఇంకా మంగళవారం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

స్వాతంత్య్రం అనేది మూడక్షరాల మాట కాదని.. దానిని సాధించేందుకు ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని స్వతంత్ర భారత వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్‌ కేశవరావు గుర్తుచేశారు. వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని మండల కార్యాలయంలో మంత్రి సబితారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌తో కలిసి ఆయన జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపుగా స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. జాతిపిత గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ముందుకు నడిపించి ప్రత్యేక రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. మహానీయుల జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.

‘గాంధీ’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి తలసాని

విద్యార్థుల కోసం ‘గాంధీ’ చిత్ర ప్రదర్శనను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌లో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో గాంధీ చిత్రాన్ని రాష్ట్రంలోని 563 తెరలపై ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను థియేటర్లకు బస్సుల్లో తీసుకెళ్లి, తిరిగి ఇంటికి చేర్చే ఏర్పాట్లను ప్రభుత్వమే చేసిందని తెలిపారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ కూర్మాచలం, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, ఐమాక్స్‌ నిర్వాహకుడు రమేష్‌ ప్రసాద్‌, విద్యార్థులతో కలిసి మంత్రి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం నెక్లెస్‌ రోడ్డులోని థ్రిల్‌ సిటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌తో కలిసి ప్రజలకు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక హాలులో విద్యార్థులతో కలిసి ‘గాంధీ’ సినిమాని వీక్షించారు. రాష్ట్రంలో 22 లక్షల మంది విద్యార్థులు.. గాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

12కల్లా జెండాల పంపిణీ పూర్తి

పంద్రాగస్టు రోజున ప్రతీ ఇంటిపైనా జాతీయ జెండాల ఎగురవేతకు పిలుపునిచ్చిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వాటి పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు 33 లక్షల జెండాలను ప్రజాప్రతినిధులు, సిబ్బంది పంపిణీ చేశారు. ఈ నెల 12కల్లా ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ పూర్తి చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ నెల 11 నుంచి 18 ఫ్రీడమ్‌ కప్‌ క్రీడాపోటీలు నిర్వహించాలని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని