సరళతర వ్యాపార నిర్వహణలో మరో గుర్తింపు

ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి రాష్ట్రం ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైంది. ఈ నెల 25న దిల్లీలో నీతి ఆయోగ్‌, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖలతో పాటు ఇజ్రాయెల్‌, స్వీడన్‌ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా నిర్వహించే ‘ది డిజీ టెక్‌ కాన్‌క్లేవ్‌- 2022’లో ఈ పురస్కారం అందజేయనున్నారు. ఎకనామిక్‌ టైమ్స్‌ ఎడిటర్‌ టి.రాధాకృష్ణ ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో పరిశోధన, అధ్యయనం తరువాతే తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. సరళతర వ్యాపార నిర్వహణ, సంస్కరణల కోసం అమలుచేస్తున్న కార్యాచరణతో పాటు మీసేవ పోర్టల్‌తో ప్రజలకు అందిస్తున్న మెరుగైన డిజిటల్‌ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డుకు రాష్ట్రం ఎంపిక కావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉందన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts