సంక్షిప్త వార్తలు (5)


15న బుద్ధవనం ప్రవేశం ఉచితం

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా బుద్ధవనం ప్రాజెక్టు సందర్శకులను ఆగస్టు 15న ఉచితంగా అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్‌ వద్ద నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును టికెట్‌ లేకుండా సందర్శించవచ్చని బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


బ్యాక్‌లాగ్‌ ఖాళీల ప్రవేశపరీక్ష ఫలితాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ గురువారం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12 నుంచి 20లోగా రిపోర్టు చేయాలన్నారు. సీట్ల కేటాయింపు పత్రాలు ఎస్సీ, ఎస్టీ గురుకుల వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.


రుణవిముక్తి కమిషన్‌ ఛైర్మన్‌గా మరోసారి నాగూర్ల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ వృత్తిదారుల రుణ విముక్తి కమిషన్‌ ఛైర్మన్‌గా నాగూర్ల వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా ఈ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. మరోసారి ఆయనను ఇదే పదవిలో నియమించాలని తాజాగా సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. నాగూర్ల ప్రగతిభవన్‌లో గురువారం సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా సంజయ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ (టీఎస్‌పీసీ) అధ్యక్షుడిగా ఆకుల సంజయ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ నుంచి ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు.


కొత్తగా 612 కరోనా కేసులు

రాష్ట్రంలో గురువారం కొత్తగా 612 కరోనా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 39,413 కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 268, రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 37 పాజిటివ్‌లు తేలాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని