మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోనున్న కేంద్రం

రాష్ట్రానికి ఊరట

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేరుకుపోయిన ధాన్యం నిల్వలకు కదలిక వస్తోంది. యాసంగి ధాన్యం నుంచి మరో ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. కొన్నేళ్లుగా యాసంగి సీజనులో వచ్చే ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి కేంద్రానికి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. ఉప్పుడు బియ్యం నిల్వలు భారీగా ఉండటంతో పాటు రాష్ట్రాల నుంచి డిమాండు తక్కువగా ఉండటంతో ఈ సీజనులో సాధారణ బియ్యమే ఇవ్వాలని రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. ఈ వ్యవహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ రగడగా మారింది. 6.05 లక్షల మెట్రిక్‌ టన్నులను ఉప్పుడు బియ్యంగా, మిగిలిన వాటిని సాధారణ బియ్యంగా ఇవ్వాలని కేంద్రం చెప్పింది. సామర్థ్యానికి మించి రాష్ట్రం నుంచి వరి దిగుబడులు వస్తుండటంతో ప్రతి మిల్లింగ్‌ సీజనులోనూ జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలోని మిల్లుల్లో గడిచిన మూడు సీజన్లకు సంబంధించిన సుమారు 91 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పేరుకుపోయింది. నెల రోజుల నుంచి తరచూ కురుస్తున్న వర్షాలతో ఆరుబయట నిల్వ చేసిన ధాన్యం తడిసిపోతోంది. ఈ నేపథ్యంలో కనీసం 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం కోరింది. అప్పటికే నిలిచిపోయిన బియ్యం సేకరణను అనుమతించిన కేంద్రం ఉప్పుడు బియ్యం విషయంలో అప్పట్లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా పోషకాలతో కూడిన ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు అంగీకరించింది. కేంద్రం అనుమతించిన ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం (ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌)తో 2020-21 యాసంగి సీజనులో 14.05 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకున్నట్లు అవుతుంది.

తెలంగాణ రైతుల కోసమే ఉప్పుడు బియ్యం సేకరణ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్రం నుంచి మరో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఎఫ్‌సీఐ వద్ద మూడేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ తెలంగాణ రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని