యువత చేతుల్లోనే దేశాభివృద్ధి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కిన ఘనత భారత్‌కే దక్కిందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన 75వ స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..యువశక్తి భారత్‌లో ఎక్కువగా ఉందన్నారు. నైపుణ్య రంగాల్లో యువత రాణిస్తేనే భారత్‌ బలమైన దేశంగా ఎదుగుతుందన్నారు. కొవిడ్‌ కష్టకాలంలో రైతులు, ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు భారత్‌కు అండగా ఉండడమే కాక భారతీయ ఔషధాలు, టీకాలను 90కి పైగా దేశాలకు అందించడం గర్వకారణమన్నారు. ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్‌ చాప్టర్‌ కార్యదర్శి సుబ్బారెడ్డి, రంగారావు, డీవీఎన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts