మహేశ్‌ భగవత్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం

కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ దేవేందర్‌సింగ్‌కూ పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ఏటా ఇచ్చే పురస్కారాలను ఆదివారం ప్రకటించారు. తెలంగాణకు 2 రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం), 17 పోలీసు పతకాలు (పీఎం) లభించాయి. పోలీసుశాఖలో విశేష సేవలందించినందుకు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ సెల్‌) ఎస్పీ దేవేందర్‌సింగ్‌ రాష్ట్రపతి పతకాలకు ఎంపికయ్యారు. 1995 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహేశ్‌ భగవత్‌కు ఇది మూడో అత్యుత్తమ పురస్కారం కావడం విశేషం. 2004లో ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్యపతకం, 2011లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. గతంలో ఆయన పలు అంతర్జాతీయ పతకాలను సాధించారు. 2004లో ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ‘పోలీస్‌ మీకోసం’ ప్రాజెక్టు చేపట్టినందుకు ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ పోలీసింగ్‌ అవార్డు సొంతమైంది. ఉమ్మడి నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు 2006లో ‘ప్రాజెక్టు ఆసరా’ నిర్వహించినందుకు ‘వెబర్‌ సావీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ సివిల్‌ రైట్స్‌ అవార్డు’ మహేశ్‌ భగవత్‌కు దక్కింది. 2017లో ‘ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్స్‌ రిపోర్ట్‌ హీరో’ అవార్డు.. అదే ఏడాది ‘టాప్‌ 100 హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అండ్‌ స్లేవరీ ఇన్‌ఫ్లుయన్స్‌ లీడర్స్‌’ అవార్డు.. 2018లో ‘ఐఏసీపీ లీడర్‌షిప్‌ ఇన్‌ హ్యూమన్‌ అండ్‌ సివిల్‌రైట్స్‌ ఇండివిడ్యువల్‌’ అవార్డులు ఆయనకు లభించాయి. 1500 మంది వరకు సివిల్స్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో మెలకువలను నేర్పించారు.

సాంకేతిక సేవలకు పట్టం...

1992లో ఎస్సైగా పోలీస్‌శాఖలో చేరిన దేవేందర్‌సింగ్‌ ప్రస్తుతం కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం(సీఐసెల్‌)లో నాన్‌కేడర్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. 1997 దాకా హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేసిన అనంతరం 2003దాకా బేగంపేట విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారిగా పనిచేశారు. యూఎన్‌ పీస్‌ మిషన్‌లో భాగంగా తైమూర్‌ లెస్టే, సౌత్‌ సుడాన్‌లలో రెండేళ్లపాటు పనిచేశారు. ఐ సెల్‌లో పనిచేస్తూ సిమి, జేఈఎం, లష్కరేతోయిబా, పీఎఫ్‌ఐ, ఐసిస్‌ మాడ్యూళ్ల కుట్రల్ని భగ్నం చేశారు. సైబర్‌నేరాల కట్టడి కోసం టీ4సీ ఏర్పాటు, సీడాట్‌, సైక్యాప్స్‌, డోపమ్స్‌, దర్పణ్‌, సత్యపాన్‌ అండ్‌ ఐవెరిఫై, నిఘాయాప్స్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.

మరో 17 మందికి పోలీసు పతకాలు...

యోగ్యమైన సేవలందించినందుకు ఐజీ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌(హైదరాబాద్‌ నేరవిభాగం), అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ (సీఐడీ), అదనపు ఎస్పీ పైళ్ల శ్రీనివాస్‌ (ఎస్‌ఐబీ), ఏసీపీ సాయిని శ్రీనివాసరావు (హైదరాబాద్‌ సెంట్రల్‌జోన్‌), డీఎస్పీలు వెంకటరమణమూర్తి (ఏసీబీ), చెరుకు వాసుదేవరెడ్డి (ఐఎస్‌డబ్ల్యూ), గంగిశెట్టి గురు రాఘవేంద్ర (టీఎస్‌పీఏ), ఎస్సై చిప్ప రాజమౌళి (రామగుండం ఎస్బీ), ఏఎస్‌ఐ కాట్రగడ్డ శ్రీనివాస్‌(రాచకొండ ఎస్బీ), ఏఆర్‌ఎస్సైలు జంగన్నగారి నీలంరెడ్డి (కామారెడ్డి డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌), సలేంద్ర సుధాకర్‌ (టీఎస్‌ఎస్‌పీ 4వ బెటాలియన్‌), హెడ్‌కానిస్టేబుల్‌ ఉండింటి శ్రీనివాస్‌ (కరీంనగర్‌ ఇంటెలిజెన్స్‌) పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. ఇదే విభాగంలో అగ్నిమాపకశాఖ నుంచి లీడింగ్‌ ఫైర్‌మన్లు వెంకటేశ్వరరావు ఎర్రగుంట వెంకటేశ్వరరావు, ఫరీద్‌ షేక్‌ ఫైర్‌ సర్వీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ కింద ఎంపికయ్యారు. హోంగార్డులు చల్ల అశోక్‌రెడ్డి, చందా సురేశ్‌, అబ్దుల్‌షుకూర్‌బేగ్‌కు పురస్కారాలు దక్కాయి.

ముగ్గురు ద.మ.రైల్వే ఉద్యోగులకు పోలీస్‌ మెడల్‌

ఈనాడు, హైదరాబాద్‌: జోన్‌ పరిధిలోని రైల్వే రక్షణ దళాని(ఆర్పీఎఫ్‌)కి చెందిన ముగ్గురు ఉద్యోగులు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహబూబ్‌నగర్‌ ఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదా తహసీన్‌, మౌలాలి శిక్షణ కేంద్రం అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాటకం సుబ్బారావు, మౌలాలి శిక్షణ కేంద్రం హెడ్‌కానిస్టేబుల్‌ బండి విజయసారథి వీరిలో ఉన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts