585 అడుగులకు సాగర్‌ నీటిమట్టం

26 గేట్ల ద్వారా నీటి విడుదల

ఎగువ నుంచి స్వల్పంగా తగ్గిన ప్రవాహం

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం పొద్దుపోయే సమయానికి జలాశయంలో నీటిమట్టం 585 అడుగులుగా ఉంది. ఈ నెల 11 ఉదయం 589.50 అడుగుల మట్టానికి చేరుకున్న అనంతరం గేట్లు తెరిచి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఎగువ నుంచి 3.13 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు అంతే నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లు ఐదడుగులు, 10 గేట్లు పది అడుగులు ఎత్తి నీటిని వదులుతున్నారు. పులిచింతల జలాశయానికి 2.87 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 11 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. జలాశయంలో నీటి మట్టం 169.55 అడుగుల వద్ద కొనసాగిస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు. ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి రెండు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2.87 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1.07 లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్‌ఫ్లో 3.89 లక్షల క్యూసెక్కులు ఉండగా పది గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. మరోవైపు గోదావరిలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ నుంచి దిగువకు ప్రవాహం కొనసాగుతోంది.


మరిన్ని

ap-districts
ts-districts