22,869 కుటుంబాలకు రైతు బీమా చెల్లింపు

కొత్తగా 3.7 లక్షల మంది రైతుల పేర్ల నమోదు

గత ఏడాది రైతుబీమా లెక్కలు తేల్చిన వ్యవసాయశాఖ

ఈనాడు, హైదరాబాద్‌ : 2021 ఆగస్టు 14 నుంచి ఈ నెల 13 వరకూ ఏడాది వ్యవధిలో 22,869 మంది రైతులు మరణించినట్లు లెక్కతేలింది. ఇవన్నీ సహజ మరణాలేనని వ్యవసాయశాఖ తెలిపింది. ఈ రైతు కుటుంబాలకు  ‘రైతుబీమా’ పథకం కింద రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని భారతీయ జీవితబీమా సంస్థ (ఎల్‌ఐసీ) అందజేసింది. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు గల రైతులకు బీమా సదుపాయాన్ని కల్పిస్తూ ఎల్‌ఐసీకి వ్యవసాయ శాఖ ఏటా ప్రీమియం చెల్లిస్తోంది.  వ్యవధి ఈ నెల 13తో ముగియడంతో వ్యవసాయశాఖ ప్రభుత్వానికి లెక్కలను అందజేసింది. ఈ ఏడాది మొత్తం 37,76,760 మంది రైతులకు రూ.1,446.50 కోట్లను ప్రీమియంగా చెల్లించాలని ఈ సొమ్మును ఎల్‌ఐసీకి విడుదల చేయాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో తెలిపింది. గత సంవత్సరం మరణించిన 22,869 మంది రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించి.... ధరణి పోర్టల్‌లో నమోదైన 3.70 లక్షల మంది రైతుల పేర్లను కొత్తగా ఈ పథకంలో చేర్చామని తెలిపింది. ఒక ఏడాది కాలంలో కొత్తగా ఇంత భారీ సంఖ్యలో పేర్లు నమోదు కావడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారని వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది.

నాలుగేళ్లలో ప్రీమియం పెరుగుదల 140 శాతం...

రైతు బీమా పథకం కింద గత నాలుగేళ్లలో మరణించిన 84వేల మంది రైతుల్లో 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు 75 శాతం పైగా ఉన్నారు. ఈ పథకం ప్రారంభమైన తొలి ఏడాది 31.25 లక్షల మంది రైతుల తరఫున కేవలం రూ.602 కోట్లను ప్రీమియంగా ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించింది. ఏటా మరణాల సంఖ్య పెరుగుతున్నందున ఎల్‌ఐసీ సంస్థ ప్రీమియం సైతం పెంచుతూ వస్తోంది. గత నాలుగేళ్లలో అర్హులైన రైతుల సంఖ్య 31.26 లక్షల నుంచి 20.83 శాతం పెరిగి 37.76 లక్షలకు చేరితే... బీమా ప్రీమియం రూ.602 కోట్ల నుంచి 140 శాతం పెరిగి రూ.1,446.50 కోట్లు కట్టాల్సి వస్తోంది. పథకం ప్రారంభమైన తొలి ఏడాది ఒక్కో రైతుకు రూ.2,271.50 చొప్పున ప్రీమియం కట్టగా, ఈ ఏడాది అది రెట్టింపయింది.


మరిన్ని

ap-districts
ts-districts