కొత్తగూడెం మైనింగ్‌ కాలేజీ భూముల ఆక్రమణ

100 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తింపు

విలువ రూ. వంద కోట్లపైనే

నివేదికలు ఉన్నా.. పట్టని యంత్రాంగం 

ఈనాడు, హైదరాబాద్‌, కొత్తగూడెం విద్యావిభాగం-న్యూస్‌టుడే: గనులకు సంబంధించిన కోర్సులపై శిక్షణ ఇచ్చే విద్యాసంస్థ అది.. మూడు వందల యాభైకి పైగా ఎకరాలు ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని స్థలాల్లో ఇప్పటికే వంద ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. 57 ఎకరాలు పరాధీనమైనట్లు అధికారులు కూడా గుర్తించారు. అయినా.. ఆక్రమణదారులపై చర్యలు కరవయ్యాయి.

కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల మధ్యఉన్న 389.62 ఎకరాల స్థలంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కాకతీయ స్కూల్‌ ఆఫ్‌ మైనింగ్‌ (యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌)ను ఏర్పాటు చేశారు. ఆ స్థలంలోని దాదాపు వంద ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అందులోని సర్వే నంబర్‌ 405లో 57 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు. ఒక పరిశ్రమ 32 ఎకరాలు, నలుగురు వ్యక్తులు 20 ఎకరాలు, మరో వ్యక్తి 5 ఎకరాలు ఆక్రమించినట్లు కొత్తగూడెం ఆర్డీవో సర్వే నివేదిక ద్వారా వెల్లడైంది. అధికారులు మాత్రం ఆక్రమణదారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈ కళాశాల ప్రాంతంలోనే భద్రాద్రి కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి ధర బహిరంగ మార్కెట్‌లో రూ.కోటికి పైగా పలుకుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన ఈ స్థలాలను మరికొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రహరీతోనే రక్షణ

ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో 2015 అప్పటి జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ మైనింగ్‌ స్కూల్‌ భూముల్లో సర్వే చేయించి హద్దులు నిర్ణయించారు. ఆ స్థలాన్ని రక్షించడానికి ప్రహరీ నిర్మించాలని అధికారులు భావించారు. అయితే నిధులు లేకపోవడంతో 32 హద్దుస్తంభాలు ఏర్పాటు చేశారు. తరవాత అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు మామూలుగానే మారాయి. గతంలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లు, స్తంభాలను ఆక్రమణదారులు తొలగిస్తున్నారు. ఆ స్థలాలు ఆక్రమించుకుని కొందరు తోటలు సాగు చేస్తున్నారు. మరికొందరు వాటిలో చిన్న పరిశ్రమలు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మైనింగ్‌ స్కూల్‌ స్థలాలను కాపాడాలని ఆ సంస్థ అధ్యాపకులు, విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు. కబ్జాదారులు భూముల్లోకి అక్రమంగా ప్రవేశించకుండా ప్రహరీ నిర్మించాలని వినతి చేస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం..

మైనింగ్‌ స్కూల్‌ పరిధిలోని భూముల ఆక్రమణలపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తూనే ఉన్నాం. ఇక్కడ 57 ఎకరాలు కబ్జా అయినట్లు 2015లో సర్వే బృందం గుర్తించింది. ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. కబ్జాకు గురైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయానికి అప్పగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి.

- పున్నం చందర్‌, ప్రిన్సిపల్‌, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, కొత్తగూడెం


మరిన్ని

ap-districts
ts-districts