రక్తదాతలకు శ్రీవారి సుపథ దర్శనం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శీఘ్రదర్శనానికి తితిదే అందిస్తున్న సౌకర్యాల్లో ఒకటి.. రక్తదాతలను సుపథం మీదుగా అనుమతించడం! ‘మానవసేవే మాధవసేవ’గా భావించి ఆపన్నులకు రక్తం ఇచ్చే వారికి తితిదే ఈ సౌలభ్యం కల్పిస్తోంది. తిరుమలలోని తితిదే అశ్విని ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో భక్తులు రక్తదానం చేస్తే, వారిని సుపథం క్యూలైన్‌లో పంపించేందుకు సిఫార్సు లేఖ, శ్రీవారి లడ్డూ ప్రసాదం, ప్రశాంసాపత్రాన్ని అందిస్తుంది. రోజూ ఇక్కడ పరిమితంగా 5-10 మంది భక్తులు రక్తదానం చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కుసుమకుమారి తెలిపారు. ‘18-55 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు. ఇటీవలి కాలంలో శస్త్రచికిత్స, వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు అనర్హులు. దాతల నుంచి ఇక్కడ సేకరించే రక్తాన్ని తిరుపతిలోని బర్డ్‌, ప్రసూతి ఆస్పత్రుల్లోని రోగులకు అందిస్తున్నామ’ని ఆమె తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts