తెలంగాణకు ప్రధానే శత్రువు!

వంద దరఖాస్తులిచ్చినా కృష్ణాజలాల్లో వాటా తేల్చలేదు

ఎనిమిదేళ్లలో దేశానికి అక్కరకొచ్చే ఒక్కపనీ చేయలేదు

భాజపా గుంటనక్కల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం

వికారాబాద్‌ బహిరంగ సభలోముఖ్యమంత్రి కేసీఆర్‌


పాలమూరుకు ఇన్ని అడ్డంకులా

రవులో ఉన్నాం. బాధల్లో ఉన్నాం. కృష్ణా జలాల్లో వాటా తేలిస్తే ఆ ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టుకుంటామని ఎనిమిదేళ్లుగా చెబుతున్నాం. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి ముడిపెట్టి జాప్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తెలివి తక్కువతనం, నిర్ణయం తీసుకోలేని తీరుతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోంది. అయినా నేను ధైర్యంగా ముందుకెళ్లి దాన్ని నిర్మిస్తున్నా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించే బాధ్యత నాదే.


ఇలాంటి దుర్మార్గులను తరిమికొట్టాలి

ఏ వాగ్దానాన్నీ ప్రధాని నెరవేర్చలేదు. రూ.15 లక్షలిస్తామన్నారు. ఎవరికీ 15 పైసలు కూడా రాలేదు. ఇటువంటి దుర్మార్గులను తరిమికొట్టాలి. అద్భుతమైన దేశాన్ని నిర్మించుకోవాలి. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి దుష్టశక్తులకు బుద్ధి చెప్పాలి. ఉజ్వల భారత్‌ లక్ష్యంగా పల్లెపల్లెనా చర్చ జరగాలి.

- సీఎం కేసీఆర్‌


ఈనాడు, వికారాబాద్‌: ఎనిమిదేళ్ల కాలంలో వంద దరఖాస్తులిచ్చినా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చలేదని, ప్రధానమంత్రే తెలంగాణకు శత్రువయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. భాజపా జెండాను చూసి మోసపోతే గోసపడతామని, బాయిలకాడ మీటర్లొస్తాయని హెచ్చరించారు. ఆ పార్టీ గుంటనక్కలొచ్చి పీక్కుతినకుండా, పాత పరిస్థితులు మళ్లీ రాకుండా, వాళ్ల రాజకీయ స్వార్థాలకు బలికాకుండా యువకులు, మేధావులు, బుద్ధిజీవులు, పెద్దలంతా కలిసి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో కలిసి వికారాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. రూ.235 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. తెరాస జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. సంస్కరణల పేరుతో కేంద్రం ప్రజలకు అన్యాయం చేస్తోందని, పెద్దపెద్ద షావుకారులకు మాత్రం రూ.20 లక్షల కోట్లు దోచిపెడుతోందని ఆరోపించారు. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు ఎన్‌పీఏల పేరిట దోచిపెట్టినట్లు కేంద్రమే చెబుతోందన్నారు. సింగరేణి బొగ్గు టన్ను రూ.4 వేలకే వస్తున్నా, విదేశాల నుంచి రూ.30 వేలు పెట్టి కొనాలంటూ ఒత్తిడి చేసిందని ఆక్షేపించారు.రాష్ట్రం ఎంత సుసంపన్నంగా ఉన్నా, కేంద్రంలో మంచి ప్రభుత్వం లేకుంటే ఆశించిన అభివృద్ధి జరగదని సీఎం పేర్కొన్నారు. కేంద్రంలో రాష్ట్రాల హక్కులను గౌరవించే, ప్రజల సంక్షేమాన్ని చూసే ఉత్తమమైన ప్రభుత్వ రావాలని ఆకాంక్షించారు. ‘‘దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. నిరుద్యోగం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అందర్నీ  కోరేది ఒక్కటే. కేంద్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చే వరకు ఎవరూ విశ్రమించకూడదు. ఆ దిశగా తెలంగాణ ప్రజలు సంసిద్ధం కావాలి.

రాష్ట్రాలిచ్చే పథకాలను ఉచితాలంటున్నారు...

కేంద్రంలో ఉన్న వాళ్లు రాష్ట్రాలు ఇచ్చే పథకాలను ఉచితాలంటున్నారు. నేను ఓ మంచి పనికోసం వికారాబాద్‌ వస్తే కొందరు చిల్లరమల్లరగాళ్లు రెండు మూడు జెండాలు పట్టుకొని నా బస్సుకు అడ్డం వచ్చారు. నేనడుగుతున్నా. మీరు ఎవర్ని ఉద్ధరించారు? ఎనిమిదేళ్లుగా భాజపా కేంద్రంలో అధికారంలో ఉంది కదా? ఒక్కటంటే ఒక్కటైనా మంచి పనిచేసిందా? నేరుగా ప్రధానినే అడుతున్నా. మీ పాలనలో రైతులు, మహిళలు, గిరిజనులు, ముస్లింలు, దళితులు.. ఇలా ఏ వర్గానికైనా మేలు చేశారా? ఏ రంగానికైనా మంచి జరిగిందా? పైగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో సంక్షేమం చేస్తుంటే, ఉచితాల పేరుతో వాటిని రద్దు చేయాలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. నాకు అడ్డం వచ్చిన భాజపా వాళ్లను, ఈ రాష్ట్ర భాజపా నాయకులను ఒక్కటే అడుగుతున్నా. మీరు తెలంగాణ వాసులా? కాదా? రాష్ట్రం సంక్షేమం గురించి మోదీని ఎందుకు అడగరు’’ అని నిలదీశారు. గ్రామాల్లోనూ ఈ అంశంపై చర్చ జరగాలన్నారు. రాజకీయంగా చైతన్యం లేకుంటే దోపిడికీ గురవుతామన్నారు.

తెలంగాణ ఊరికే రాలేదు

తెలంగాణ ఊరికే రాలేదని, పద్నాలుగేళ్లు పోరాడితే వచ్చిందని కేసీఆర్‌ గుర్తుచేశారు. ‘‘ఇప్పుడు ఎవడు పడితే వాడు..ఎలా పడితే అలా మాట్లాడుతున్నరు. ఉద్యమం జరిగిన రోజు గడ్డల మీద కూసున్నోళ్లు. మన బాధలు చూడనోళ్లు, మనల్ని చూసి నవ్వినోళ్లు కూడా ఈరోజు అడ్డం పొడుగు మాట్లాడుతున్నరు. తెచ్చిన తర్వాత ప్రజలు అధికారమిస్తే బ్రహ్మాండంగా పనిచేశా. ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.

భూముల ధరలు పడిపోతాయని దుష్ప్రచారం

తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని కొందరు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోనే రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో మూడెకరాల భూమి ఉన్న రైతు కోటీశ్వరుడయ్యాడు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నో బాధలు పడ్డాం. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనమంతా చైతన్యవంతం కావాలని’’ కేసీఆర్‌ ప్రజలను కోరారు.

వెయ్యి మందిని కర్ణాటకకు తీసుకెళ్లండి

వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... వికారాబాద్‌ నుంచి 500 మంది మహిళలను, 500 మంది పురుషులను కర్ణాటకకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి భాజపా ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇస్తుందో చూపించాలన్నారు. ఇటీవల రాయచూరు ప్రాంత ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పునరుద్ఘాటించారు.


ప్రధాని దేశానికి అక్కరకొచ్చే ఒక్క మాటా చెప్పలేదు..

చదువుకున్నోళ్లు, కవులు, కళాకారులు, మేధావులు ఆలోచించాలె. ప్రధాని మోదీ సోమవారం జాతినుద్దేశించి మాట్లాడుతుంటే నేనూ ఎంతో ఆశగా విన్నా. ఎనిమిదేళ్లలో ఏం చేయలే. మిగతా రెండేళ్ల కోసమైనా ఏమైనా చెబుతారనుకున్నా. ఏమీ లేదు. గంటసేపు మాట్లాడి ఊదరగొట్టారు.  నెత్తికో రుమాలు కట్టి వేషం, కథ, డైలాగులు తప్ప ఒక్క మంచి పథకం గురించీ చెప్పలే. ఇదా మనకు కావాల్సింది. అందుకే మీరందరూ చైతన్యవంతులు కావాలి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపాలి.

- సీఎం కేసీఆర్‌మరిన్ని

ap-districts
ts-districts