కిషన్‌రెడ్డి కుటుంబ ఆస్తులు రూ.22 కోట్లు

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ.22.54 కోట్లుగా, అప్పులు రూ.1.59 కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి కుటుంబ ఆస్తుల విలువ రూ.4.34 కోట్ల మేర పెరగగా, అప్పులు రూ.7 లక్షల మేర తగ్గాయి. కేంద్రమంత్రి ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన వివరాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆ ప్రకారం.. కిషన్‌రెడ్డి పేరు మీద వ్యక్తిగతంగా రూ.1.44 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి కావ్య పేరు మీద రూ.12.83 కోట్ల ఆస్తులు, రూ.75,16,190 అప్పులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఆమె వ్యక్తిగత ఆస్తి రూ.6,46,88,046 మేర, అప్పు రూ.75,16,190 మేర పెరిగింది. హిందూ ఉమ్మడి కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) పేరు మీదున్న ఆస్తి విలువ (రూ.1,23,23,000) ఏమాత్రం మారలేదు. కుమార్తె వైష్ణవి పేరున రూ.5.51 కోట్ల ఆస్తి, రూ.84.33 లక్షల అప్పు ఉంది. ఈమె ఆస్తి విలువ గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.1.87 కోట్లు, అప్పు రూ.76.66 లక్షల మేర తగ్గింది. కుమారుడు జి.తన్మయ్‌ పేరిట రూ.97,52,600 ఆస్తులున్నాయి. ఆయన ఆస్తి గత ఏడాది కంటే రూ.95,15,000 పెరిగింది.


మరిన్ని

ap-districts
ts-districts