చిన్నాభిన్నం..!

వరదలతో చిన్నతరహా ఎత్తిపోతల పథకాలకు భారీ నష్టం

రాష్ట్ర వ్యాప్తంగా 600 తటాకాలకు గండ్లు

కానరాని పునరుద్ధరణ చర్యలు

ఈనాడు - హైదరాబాద్‌

రీంనగర్‌ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రూ.కోట్ల విలువైన 11 లిఫ్టులు పూర్తిగా చెడిపోయాయి. 32 భారీ మోటార్లలోకి ఒండ్రుమట్టి చేరింది. ఈ జిల్లాలో బీర్పూరు, ధర్మపురి మండలాల్లో పెద్ద సంఖ్యలో లిఫ్టులు ఉన్నాయి. మంగెల, ఆరేపల్లి, దొంతాపూర్‌, జైన, రాజారం పథకాల్లో ఒక్కోచోట నాలుగేసి మోటార్లు మునిగిపోయాయి. కమ్మునూరు, రేకులపల్లి, ఎడపల్లి, రాయపట్నం, తిమ్మాపూర్‌, దొమ్మనపేటలలో రెండేసి మోటార్లు ఉండగా ఈ పథకాలకు భారీ నష్టం వాటిళ్లింది. ‘ఐడీసీ లిఫ్టుపై ఆధారపడి సాగుచేసుకుంటున్న తమకు గోదావరి తీరని నష్టాన్ని మిగిల్చింది’ అని ధర్మపురి మండలం రాయపట్నం ఎత్తిపోతల పథకం ఆయకట్టు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌ తెలిపారు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.


గోదావరి వరదలు... కుంభవృష్టి వర్షాలతో చిన్నతరహా నీటిపారుదల వ్యవస్థా ఛిన్నాభిన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, దాని ఉపనదులు, వాగుల చెంత ఉన్న నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఎత్తిపోతల పథకాలు(లిఫ్టులకు), ఇతర చెరువులకు భారీ నష్టం వాటిల్లింది. అయినప్పటికీ లిఫ్టుల పునరుద్ధరణకు ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొట్టుకుపోయాయి

ఆదిలాబాద్‌ నుంచి భద్రాద్రి జిల్లా వరకు గోదావరి సృష్టించిన విలయానికి ఐడీసీ లిఫ్టుల రూపురేఖలు మారిపోయాయి. నది ఒడ్డునే నిర్మించిన పథకాలు చాలా చోట్ల కొట్టుకుపోయాయి. ఎత్తు ప్రాంతాల్లో ఉన్నవాటినీ వరద ముంచెత్తింది. పంపుహౌసుల్లోని మోటార్లలోకి నీళ్లు చేరడం, విద్యుత్‌ ప్యానల్‌బోర్డులు చెడిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు నీళ్లలో నాని కొన్ని చోట్ల, వాటి స్తంభాలు, గద్దెలు కూలి నష్టాలు వాటిల్లాయి.

* భద్రాద్రి జిల్లాలో అశ్వాపురం మండలంలో కట్టంవారిగూడెంలో మోటార్లు కొట్టుకుపోయాయి. ఈ జిల్లాలో ఐటీడీఏ ఆర్థిక సహకారంతో నిర్మించిన లిఫ్టులకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో నష్టం ఎంతనేది ఇంకా అంచనా వేయలేదు.

ఆనవాళ్లు లేని చెరువు కట్టలు..

భారీ వర్షాలకు వరద అమాంతం పెరగడంతో పలుచోట్ల మిషన్‌ కాకతీయ పథకంలో పునరుద్ధరించిన చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. సుమారు 75 భారీ చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో 65, నిజామాబాద్‌ జిల్లాలో 33, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 50 తటాకాలకు గండ్లు పడ్డాయి. 600 చెరువులకు నష్టం వాటిల్లింది. 200 చోట్ల సాగునీటి ప్రాజెక్టుల కాల్వలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల దెబ్బతిన్నాయి.

నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ద్వారా ఏర్పాటు చేసిన చిన్నతరహా లిఫ్టులకు భారీ నష్టం వాటిల్లగా ఇప్పటికీ కనీస పరిశీలన చేయలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో లిఫ్టు కింద అయిదు వందలకుపైగా ఎకరాలు సాగవుతున్న పథకాలు ఉన్నాయి. ఐడీసీ విభాగాన్ని నీటిపారుదల శాఖలో విలీనం చేసిన తరువాత ఈ లిఫ్టుల పర్యవేక్షణ అంతగాలేదని ఆయకట్టు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెరువులు, ప్రాజెక్టు కాల్వల కింద దాదాపు రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు ఉన్నాయి. అయినా ఇప్పటి వరకూ పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts