జనగణమన.. గొంతెత్తి పాడిన తెలంగాణ

 రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన

హైదరాబాద్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. జిల్లాల్లో మంత్రులు

స్వతంత్ర భారత  వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తెలంగాణ   వ్యాప్తంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రహదారులపై కూడళ్లలో వాహనాలను నిలిపివేసి.. వాహనదారులు, పోలీసులు, ప్రజలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రంలో జనగామలో జాతీయ గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు.

ఈనాడు, హైదరాబాద్‌: జనగణమన అధినాయక జయహే.. అంటూ తెలంగాణలోని గొంతుకలన్నీ ఒక్కటయ్యాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రజలంతా ఎక్కడివారు అక్కడే నిల్చొని సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్రమంతటా జాతీయ గీతంతో పాటు జైహింద్‌, జైతెలంగాణ నినాదాలు మార్మోగాయి. హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌ జీపీవో సర్కిల్‌లోని నెహ్రూచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్‌ పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించగా.. ఆయనతో వేల మంది గొంతు కలిపారు.

పిడికిలెత్తి నినదించిన సీఎం..

ఆబిడ్స్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్‌ ఒవైసీ, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, బేతి సుభాష్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొని జాతీయగీతాన్ని ఆలపించారు. అనంతరం సీఎం పిడికిలెత్తి బోలో స్వతంత్ర భారత్‌కి జై, జైతెలంగాణ... అంటూ నినాదాలు చేశారు. మంత్రులు, నేతలు గొంతుకలిపారు. అంతకుముందు ఎంపీ అసదుద్దీన్‌తో కలిసి నెహ్రూ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఆబిడ్స్‌ జీపీవో సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు, బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ సంగీత విభావరితోపాటు పలు అంశాలుంటాయని వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు ప్రకటించారు.

కూడళ్ల వద్ద నిలిచిన వాహనాలు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా సామూహిక గీతాలాపనకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలీసుశాఖ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద నిమిషం పాటు రెడ్‌సిగ్నల్‌ ఇచ్చి వాహనాలను నిలిపివేసి అందరూ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులూ జాతీయగీతాన్ని ఆలపించారు. సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన మైకుల్లోనూ జాతీయ గీతం వినిపించారు.

జిల్లాల్లో..: జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద కాన్వాయ్‌ను ఆపి తన సిబ్బంది, పోలీసులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. నల్గొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌లో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ జాతీయ గీతాలాపన చేశారు. ఇతర మంత్రుల్లో గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో, ఎస్‌.నిరంజన్‌రెడ్డి వనపర్తిలో, సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌లో, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో, జగదీశ్‌రెడ్డి యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో, కొప్పుల ఈశ్వర్‌ గౌలిదొడ్డి గురుకులంలో జాతీయ గీతాలాపన చేశారు. శాసనమండలి వద్ద, సచివాలయంలో, డీజీపీ కార్యాలయంలో, సికింద్రాబాద్‌ రైల్వే ప్రాంగణంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. చార్మినార్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమం మతసామరస్యాన్ని చాటింది.

ఉద్యోగ సంఘాల కార్యాలయాల్లో..

టీజీవో, టీఎన్జీవో, పీఆర్‌టీయూటీఎస్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర ఉద్యోగుల సంఘం,  ప్రభుత్వరంగ ఉద్యోగుల సమాఖ్య కార్యాలయాల్లో సామూహిక జాతీయ గీతాలాపన జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, వేల సంఖ్యలో విద్యార్థులు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు జాతీయ గీతాలాపన చేశారు. వ్యవసాయ కూలీలు, కల్లుగీత కార్మికులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. హైదరాబాద్‌లో బేగంబజార్‌ నుంచి అబిడ్స్‌లోని సీఎం సబావేదిక వద్ద వరకు సుమారు 2వేల మంది వ్యాపారులు, మహిళలు జాతీయ పతకాలతో ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో జరిగిన పెళ్లి వేడుకలో వధూవరులు అవినాష్‌రెడ్డి, భావనలతో పాటు హాజరైన బంధువర్గమంతా జాతీయ గీతాలాపన చేశారు.

55 మెట్రో రైళ్లలో..: జాతీయ గీతం ఆలాపన నేపథ్యంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు మెట్రోరైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మూడు కారిడార్లలోని 55 మెట్రోరైళ్లను 52 సెకన్లపాటు నిలిపేశారు. లోకోపైలట్లు సహా ప్రయాణికులు సీట్లలో నుంచి లేచి నిలబడి జనగణమన పాడారు.


మల్లారెడ్డి వర్సిటీలో 30 వేల మందితో ఘనంగా..

మేడ్చల్‌, మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: పిల్లలు ఎంత బాగా విద్యనభ్యసిస్తారనే దానిపై దేశ భవిత ఆధారపడి ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి పురపాలిక పరిధి మైసమ్మగూడ మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా 30వేల మంది విద్యార్థులు 365 రోజుల పాటు దేశభక్తితో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. జాతీయ జెండాలను ప్రదర్శించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావుతోపాటు మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 30 వేల మంది ఒకేసారి, ఒకేచోట గళమెత్తడంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో వర్సిటీ పేరు నమోదైంది. మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టు న్యాయవాది డా.జీవీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ వరప్రసాద్‌ రికార్డు పత్రాన్ని అందజేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని