దత్తత ప్రక్రియ సులభతరం చేయాలి

 కోర్టుకు నివేదించిన అమికస్‌ క్యూరీ శ్రీరఘురాం

ఈనాడు, అమరావతి: పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకునే వ్యవహారం సులభతరం చేయాల్సిన అవసరం ఉందని సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాం (అమికస్‌ క్యూరీ) ఏపీ హైకోర్టుకు నివేదించారు. చిన్నారులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనంపై ఇటీవల పత్రికల్లో వచ్చిన రెండు కథనాలను పరిగణనలోకి తీసుకొని సుమోటో ప్రజాహిత వ్యాజ్యాలుగా మలిచి హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పిల్‌పై మంగళవారం విచారణలో శ్రీరఘురాం ప్రాథమిక వివరాలను కోర్టు ముందుంచారు. అందులో.. ‘దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే దత్తతకు బాగా డిమాండ్‌ ఉన్నప్పటికీ, ఈ ప్రక్రియ జటిలంగా ఉంది. పిల్లలు కావాలనుకుంటున్న వారు చట్టవిరుద్ధ మార్గాలను ఎంచుకుంటున్నారు. విచారణలో ఉన్న ప్రస్తుత రెండు కేసుల్లోనూ తల్లి లేదా తండ్రి ప్రమేయంతోనే శిశు విక్రయాలు జరిగాయి. శిశువులు కన్పించకుండా పోయినప్పుడు పోలీసులు తక్షణం స్పందించేలా చర్యలు తీసుకోవాలి. శిశు విక్రయాలను అరికట్టేందుకు తల్లిదండ్రులను చైతన్యవంతుల్ని చేయాలి. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు స్థానిక అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల పర్యవేక్షణ అవసరం. మానవ అక్రమ రవాణా, శిశు విక్రయాలను అరికట్టేందుకు వివిధ వర్గాల భాగస్వాములతో చర్చించి కోర్టుకు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలి’ అని కోరారు. అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అమికస్‌ క్యూరీ ప్రతిపాదనలను పరిశీలించాలని ఏజీ ఎస్‌.శ్రీరామ్‌కు సూచించింది. ఈ వ్యాజ్యాల విచారణలో కోర్టుకు సహకారం అందించాలని పేర్కొంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని