
సంక్షిప్త వార్తలు(14)
ప్రజలకు సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర పండగ బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరువులు, పచ్చని పంటపొలాల పక్కన ప్రకృతితో మమేకమై.. తొమ్మిది రోజులపాటు సాగిన ఆడబిడ్డల ఆటాపాటలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణం సంతరించుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
నర్సింగ్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి
కాళోజీ వర్సిటీని కోరుతున్న విద్యార్థులు
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: కాళోజీ విశ్వవిద్యాలయ పరిధిలో నర్సింగ్ కోర్సుల ప్రవేశాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు అమలుచేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే వర్సిటీలో ఇతర కోర్సుల సీట్ల భర్తీలో వీటిని అమలుచేస్తుండగా నర్సింగ్‌లో చేయడం లేదన్నారు. వర్సిటీ పరిధిలోని 77 నర్సింగ్ కళాశాలల్లో 4230, 16 బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాలల్లో 850, 20 ల్యాబ్ టెక్నాలజీ కళాశాలల్లో 685 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లున్నాయి. వీటిలో చేరడానికి గడువు ఈనెల 3తో ముగుస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తే పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయంపై రిజిస్ట్రార్ డా.ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా తమకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఈ రిజర్వేషన్లపై ఉత్తర్వులు లేనందున అమలు చేయలేమన్నారు.
ఒక్క రోజులోనే ముగిసిన రాపెల్లింగ్ పోటీలు
మావోయిస్టు కదలికల నేపథ్యంలో పోలీసుల అనుమతి నిరాకరణ
ఈనాడు, ఆదిలాబాద్, ఇచ్చోడ, న్యూస్‌టుడే: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గాయత్రి జలపాతంలో 4 రోజుల పాటు జరగాల్సిన వాటర్ రాపెల్లింగ్ పోటీలను మావోయిస్టు కదలికల నేపథ్యంలో ఒకే రోజు నిర్వహించారు. దీంతో ఔత్సాహికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సెప్టెంబరు 30 నుంచి ఈ నెల 4 వరకు ఈ పోటీలను నిర్వహించడానికి మూడు నెలల కిందటే అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపకుడు రంగారావు అనుమతులు తీసుకున్నా ప్రస్తుతం మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసు, అటవీ అధికారులు అక్కడికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు శనివారం ఒక్క రోజే అదీ 3 గంటల వరకే నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో కొద్ది మంది మాత్రమే పోటీల్లో పాల్గొన్నారు. చాలా మంది ఆదివారం పోటీల్లో పాల్గొనేందుకు, తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. పోటీలు లేవని నిర్వాహకులు చెప్పడంతో ఔత్సాహికులు నిరాశతో వెనుదిరిగారు. ఆదివారం బహుమతులు ప్రదానం చేసి పోటీలు ముగించినట్లు ప్రకటించారు.
కోఠిలో దుర్గమ్మ భారీ ప్రతిమ
దసరా నవరాత్రుల నేపథ్యంలో మట్టితో మలచిన 45 అడుగుల దుర్గాదేవి భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని కోఠి ఇసామియాబజార్‌లో నెలకొల్పారు. ఇంతెత్తు ఈ ప్రతిమను విక్టోరియా క్రీడాస్థలంలో నీళ్ల ట్యాంకర్ల సాయంతో నిమజ్జనం చేయనున్నారు. - న్యూస్‌టుడే, హైదరాబాద్
గాంధీ విగ్రహాల ఎదుట వీఆర్ఏల మౌనదీక్ష
ఈనాడు, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాల ఎదుట దీక్షలు నిర్వహించారు. పే స్కేలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వారసులకు ఉద్యోగాల కల్పన డిమాండ్లతో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 71 రోజుకు చేరుకుంది.
‘ఎన్నికల్లో లబ్ధికే పీఎఫ్ఐపై నిషేధం’
ఈనాడు, హైదరాబాద్: దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టి.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం ప్రభుత్వం పీఎఫ్ఐతోపాటు మరో అయిదు అనుబంధ సంస్థలపై నిషేధం విధించిందని సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ విమర్శించింది. ఇది క్రూరమైన, అప్రజాస్వామిక చర్య అని అభివర్ణించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. వచ్చే గుజరాత్ ఎన్నికలతోపాటు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ వర్గం ఓట్లను పొందడానికి భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ చర్యకు పూనుకొందన్నారు. పీఎఫ్ఐపై నిషేధాన్ని అన్ని ప్రజాస్వామ్య సంఘాలు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.
నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏపీ తీరం వద్ద గాలులతో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. మరోవైపు బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో ఇలాగే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి … జిల్లా సింగాపూర్‌లో 7.1, మనూర్లో 3.1, ముక్తాపూర్‌లో 3.1, రాయికోడ్‌లో 2.1, మేడారం(ములుగు జిల్లా)లో 1.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో 10 నుంచి ‘ప్రపంచ జియోస్పేషియల్’ సదస్సు
దిల్లీ: ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రపంచ జియోస్పేషియల్ సమాచార సదస్సు (యూఎన్డబ్ల్యూజీఐసీ) ఈ నెల 10 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. అయిదు రోజుల పాటు సాగే ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నట్లు కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. ఈ సదస్సుకు 115 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు.
ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో వెయిటేజీ ఇవ్వండి
ఈనాడు, హైదరాబాద్: పల్లె, బస్తీ దవాఖానాల్లో సేవలందించడానికి కొత్తగా నియమించనున్న మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల్లో వెయిటేజీ కల్పించాలని నేషనల్ మెడికల్ అసోసియేషన్ (ఎన్ఎంఏ) విజ్ఞప్తి చేసింది. తమకు న్యాయం చేయాలంటూ ఎన్ఎంఏ ప్రతినిధులు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. తొలివిడత నియామకాల్లో తమ కోర్సు మార్కులకు 90 శాతం, సీనియారిటీకి 10 శాతం వెయిటేజీని పరిగణనలోకి తీసుకున్నారని, మలివిడతలో ఆ విధానాన్ని పాటించడం లేదని ఈ సందర్భంగా వారు మంత్రికి వివరించారు.
ఎనిమిదేళ్లయినా.. ‘తాత్కాలిక’మేనా!
నీటిపారుదల, రెవెన్యూ శాఖల్లో పదోన్నతుల అమలు తీరు
ఈనాడు, హైదరాబాద్: నీటి పారుదల, రెవెన్యూ శాఖల్లో పూర్తిస్థాయి సీనియారిటీ నిర్ణయం కాకుండానే.. ‘తాత్కాలికం’ పేరుతో పదోన్నతులు కల్పిస్తున్న తీరును పలువురు ఉద్యోగులు తప్పుపడుతున్నారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా ఇప్పటికీ ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించిన స్పష్టమైన జాబితాలు అందలేదు. వాటిని తెప్పించుకోవడంలో విఫలమవుతున్న శాఖాధిపతులు ఎన్నాళ్లు తాత్కాలిక పద్ధతి పేరుతో పదోన్నతులు కల్పిస్తారని పలువురు మండిపడుతున్నారు. నీటిపారుదల శాఖలో 839 మంది ఇంజినీర్లకు ‘తాత్కాలిక’ పదోన్నతులు కల్పించగా ఈ విషయంలో సమతుల్యత లోపించిందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూశాఖలోనూ దాదాపు 200 మందికి తహసీల్దార్ల నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించేందుకు జాబితా సిద్ధమవుతుండగా దానిపైనా చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి వివాదాలకు ఆస్కారం లేకుండా వేగంగా ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఉద్యోగులకు పెండింగ్ డీఏలు విడుదల చేయండి: శ్రీధర్‌బాబు
గాంధీభవన్, న్యూస్‌టుడే: ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు నెలల డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డి.శ్రీధర్‌బాబు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. జీవో 317 వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా 3వ తేదీలోపు వేతనాలను, పింఛన్లను విడుదల చేయాలని కోరారు.
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించండి: జగ్గారెడ్డి
గాంధీభవన్, న్యూస్‌టుడే: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించి వారికి దసరా కానుక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. వారికి పేస్కేల్ పెంచాలని, వారసులకు ఉద్యోగాల జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
కొత్తగా 66 కొవిడ్ కేసులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 66 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,38,035కు పెరిగింది. తాజాగా మరో 79 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,33,294 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 2న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 630 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,511 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,76,92,503కు పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 44 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 52,269 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు.
ఇంద్రకీలాద్రిపై వెలుగు జిలుగులు
దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆదివారం భక్తులకు సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చింది. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు తెల్లవారుజామున నుంచే భారీగా వచ్చారు. ఇంద్రకీలాద్రి కొండ, క్యూలైన్లు నిండి భక్తులు రోడ్లపై ఇబ్బందులుపడ్డారు. చిన్నారులతో క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిల్చొన్నారు. తోపులాట జరగడంతో పలువురు గాయపడ్డారు. దేవాలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. దేవాలయం ముందువైపు దుర్గమ్మ భక్తులకు అభయమిస్తున్నట్లుగా.. కళ్లు మూసుకుని తెరుస్తూ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ దీపాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
- ఈనాడు, అమరావతి
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు