పెళ్లి, ప్రసవం రోజుల్లోనూ పనులకు వెళ్లారట!

ఉపాధి హామీలో వెలుగులోకి అక్రమాలు

ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నిరుపేదలను ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకం కింద మంజూరవుతున్న నిధులను దోచుకోవడానికి అలవాటుపడ్డ కొందరు అక్రమార్కులు.. కూలీలు పెళ్లి చేసుకున్న, ప్రసవమైన రోజున కూడా పనులకు వెళ్లినట్లు చూపారు. రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేసి డబ్బులు దండుకున్నట్లు వెలుగు చూసింది. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలో ఏప్రిల్‌ 1, 2019 నుంచి మార్చి 31, 2022 వరకు రూ.23 కోట్లతో చేపట్టిన 4,796 ఉపాధి హామీ పనులపై ఆదిలాబాద్‌ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం అర్ధరాత్రి వరకు ప్రజావేదిక నిర్వహించి సామాజిక తనిఖీ చేపట్టారు. రికార్డుల్లో తప్పుడు హాజరును నమోదు చేసి ఉపాధి సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని కొందరు కూలీలు తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. దీనిపై తనిఖీ బృందం విచారణ చేపట్టగా.. 9 మంది కూలీలు పెళ్లి చేసుకున్న రోజున్నే పనులకు హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేశారని బట్టబయలైంది. మరో ఇద్దరు కూలీలు ప్రసవమైన రోజు కూడా ఉపాధి పనులకు వచ్చినట్లు హాజరు వేశారని వెలుగులోకి వచ్చింది. అట్లాగే, ప్రస్తుతం పెరుగుతున్నాయంటూ రికార్డుల్లో నమోదు చేసిన మొక్కలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని గుర్తించారు. దీంతో, నిర్లక్ష్యం ప్రదర్శించాడని పేర్కొంటూ సాంకేతిక సహాయకుడు నవీన్‌ను విధుల నుంచి తొలగించారు. వీటితో పాటు మరికొన్ని పనుల్లో తేడాలున్నట్లు గుర్తించిన బృందం సభ్యులు.. అందుకు బాధ్యులైన సిబ్బంది నుంచి రూ.3 లక్షలు రికవరీ చేయాలని, రూ.1 లక్ష జరిమానా విధించాలని నిర్ణయించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని