విష సంస్కృతిపై విచ్చుకత్తి

వైద్య కళాశాలల్లో శ్రుతిమించుతున్న ర్యాగింగ్‌..

కట్టడికి మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్‌ఎంసీ

ఫిర్యాదులకు ప్రత్యేక ఈమెయిల్‌

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పుతోంది. సీనియర్లు దురుసుగా, అసభ్యంగా వ్యవహరిస్తూ వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఇటీవల జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని తీవ్రంగా పరిగణించిన ఎన్‌ఎంసీ యాంటీ ర్యాగింగ్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ అరుణ వి.వాణికర్‌ అధ్యక్షతన గత నెల 27న అత్యవసరంగా సమావేశమైంది. వైద్య విద్యార్థుల ఆత్మహత్యలకు ర్యాగింగ్‌ కూడా ఒక ప్రధాన కారణమని కమిటీ అభిప్రాయపడింది. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై వైద్యవిద్య సంచాలకుల ఆధ్వర్యంలో తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని అభిప్రాయపడింది. బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా antiragging@nmc.org.in పేరిట ఈమెయిల్‌ ఐడీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీన్ని వసతిగృహాలు, భోజనశాలలు, తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రసంగ, సాధారణ గదులు తదితర ప్రదేశాల్లో ప్రముఖంగా కనిపించేలా ప్రదర్శించాలని అన్ని వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు జారీ చేసింది. గత అయిదేళ్లుగా విభాగాలవారీగా ఎంతమంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు? ఎంతమంది చదువును మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు? తదితర వివరాలను ఈ నెల 7లోగా పంపించాలని కోరింది.

ఇలా చేయడం నేరం..

స్తులపై వ్యాఖ్యానం.. గుంజీలు తీయించడం.. గోడ కుర్చీ వేయించడం.. అసభ్యకరంగా, కించపర్చేలా మాట్లాడడం, వసతిగృహాల్లో రాత్రివేళ గదుల్లోకి పిలిపించుకోవడం.. జుట్టు కత్తిరించడం.. మద్యం సీసాలు తేవాలని పురమాయించడం.. అశ్లీలంగా వ్యవహరించాలని ప్రోత్సహించడం.. దుస్తులను విప్పాలని బలవంతపెట్టడం.. తదితర చర్యలకు పాల్పడడం నేరం.

శిక్షలు కఠినం..

* ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను కళాశాల నుంచి నెల రోజులపాటు సస్పెండ్‌ చేస్తారు.

* ఏడ్పించడం, హేళన చేయడం లాంటివి చేస్తే 6 నెలలు, శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష విధిస్తారు.

* గాయపర్చితే రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా, అపహరణ, అత్యాచారాలకు పాల్పడినా, తీవ్రంగా గాయపరిచినా అయిదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

* ర్యాగింగ్‌ కారణంగా ఎవరైనా మృతి చెందినా, ఆత్మహత్యకు పాల్పడినా నిందితులకు యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.

తాజా మార్గదర్శకాలు..

* అన్ని వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ నిరోధక బృందాలను ఏర్పాటుచేయాలి.

* ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షకు గురవుతారని తెలియజెప్పేలా కళాశాలల ఆవరణలో బోర్డులను విస్తృతంగా ప్రదర్శించాలి.

* బాధితులు ఫిర్యాదు చేయడానికి వీలుగా పెట్టె, ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌.. ఇలా వేర్వేరు మార్గాలను అందుబాటులో ఉంచాలి.

* స్థానిక పోలీసు అధికారుల నంబర్లను ప్రదర్శించాలి.

* వైద్య కళాశాలలు, వసతిగృహాలు, ఆహారశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేస్తుండాలి.

* ర్యాగింగ్‌ చేయబోమని విద్యార్థి, ఒకవేళ చేస్తే తీసుకునే కఠిన చర్యలకు కట్టుబడి ఉంటామని తల్లిదండ్రులు ముందస్తుగా అఫిడవిట్‌ ఇవ్వాలి.

* బాధిత విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు వైద్యనిపుణుల సేవలు కల్పించాలి.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు