తెలంగాణం.. స్వచ్ఛ గ్రామీణం

 స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో దేశంలో తొలి ర్యాంకు

టాప్‌-50లో 31 జిల్లాలకు చోటు

ఈనాడు, దిల్లీ: కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం నిర్వహించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించింది. ప్రజాభిప్రాయం (350), ప్రత్యక్ష పరిశీలన (300), సేవల పురోగతి (350) కొలమానాల ఆధారంగా మొత్తం 1,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 971.62 మార్కులు సాధించి తొలి స్థానాన్ని ఆక్రమించింది.రెండు, మూడు ర్యాంకులను హరియాణా (927.05), తమిళనాడు (883.48) పొందాయి. ఆంధ్రప్రదేశ్‌కు 12వ ర్యాంకు లభించింది. జిల్లాల కేటగిరీలో ప్రకటించిన ర్యాంకుల్లో జగిత్యాల, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జాతీయ స్థాయిలో రెండు, మూడు, అయిదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ కేటగిరీలో తొలిస్థానాన్ని హరియాణాలోని భివానీ పొందింది. దేశవ్యాప్తంగా 709 జిల్లాలకు  ర్యాంకులు ప్రకటించగా తెలంగాణలోని 31 జిల్లాలు టాప్‌-50లో నిలిచాయి. జోగులాంబ గద్వాల ఒక్కటి 51వ స్థానానికి పరిమితమైంది. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కేంద్ర జల్‌శక్తి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, గిరిరాజ్‌సింగ్‌ల సమక్షంలో జరిగిన స్వచ్ఛభారత్‌ దివస్‌ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించి విజేతలకు అందజేసింది.

దక్షిణాదిలోనూ ముందు వరుసలో తెలంగాణ

గ్రామీణ స్వచ్ఛతలో దక్షిణాదిలోనూ తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందు వరుసలో నిలిచింది. జాతీయస్థాయిలో నమూనాలు సేకరించిన 24.1% గ్రామాల్లో మాత్రమే సామాజికస్థాయి కంపోస్టింగ్‌ గుంతలు ఉండగా, తెలంగాణలో మాత్రం గరిష్ఠంగా 99.2% గ్రామాల్లో ఇవి కనిపించాయి.

* రాష్ట్రంలో 99.9% గ్రామాల్లో ఇంటింటి నుంచి లేదంటే ఒక ఫిక్స్‌డ్‌పాయింట్‌ నుంచి చెత్తను సేకరిస్తున్నారు.

* 99.4% గ్రామాల్లో ఘనవ్యర్థాల నిల్వకు ఒక ప్రత్యేక స్థలంకానీ, షెడ్‌కానీ ఉంది.

* 100% గ్రామాల్లో ఘనవ్యర్థాలను పారబోసేందుకు ఏదో ఒక వ్యవస్థ కనిపించింది.

* 99.8% ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఈ విషయంలో తెలంగాణ దేశంలో 9వ స్థానానికి పరిమితమైంది. ఆరు రాష్ట్రాల్లో 100% ఇళ్లకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దక్షిణాది నుంచి పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు చోటు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో 99.5% కుటుంబాలకు సొంత మరుగుదొడ్లు ఉన్నాయి. పుదుచ్చేరిలో కూడా ఇంతే. దీంతో ఈ రెండూ 1, 2 స్థానాల్లో నిలిచాయి.


రాష్ట్రంలో 97.5% మేర ద్రవ వ్యర్థాల నిర్వహణ

మిగత రాష్ట్రాల కంటే అత్యధికంగా రాష్ట్రంలో 97.5%మేర ద్రవ వ్యర్థాల నిర్వహణ జరుగుతోంది. 98.1% మంది గ్రామీణులు ఇక్కడ జరుగుతున్న ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణ పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో తేలింది. దేశవ్యాప్తంగా 17,559 గ్రామాల్లో ఈసర్వే నిర్వహించారు. 2021 డిసెంబరు నుంచి 2022 ఏప్రిల్‌ మధ్య కాలంలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించారు. ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేను ఇప్సోస్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ నిర్వహించింది. మొత్తం 5,13,77,176 మంది ప్రజలు ఇందులో తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. తొలిర్యాంకు సాధించిన తెలంగాణ తరఫున ఆదివారం విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, డైరెక్టర్‌ హనుమంతరావులు అవార్డు అందుకున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts