కొత్త రంగాలకు తోడ్పాటు

 హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఎస్‌బీఐ స్టార్టప్‌ బ్యాంకు

వ్యవసాయ అనుబంధ రంగాలకు చేయూతనివ్వాలి

రుణాలందించడంలో ధరణి పోర్టల్‌తో సమస్యలు

ఖమ్మం, సిరిసిల్ల, జనగామలు 100% డిజిటల్‌ బ్యాంకింగ్‌ జిల్లాలు

రాష్ట్రంలో కొత్తగా 17 శాఖలు...200 ఏటీఎంలు

ఈనాడు ఇంటర్వ్యూలో ఎస్‌బీఐ సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతున్న నేపథ్యంలో అనుబంధ రంగాలైన ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రుణాలను పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎస్‌ఎల్‌బీసీ ఛైర్మన్‌, ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) అమిత్‌ జింగ్రాన్‌ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రుణాల్లో నాన్‌ పెర్ఫార్మింగ్‌ ఎసెట్స్‌(ఎన్‌పీఏ) పెరుగుతుండటం కూడా ఆందోళనకరమని దీనికి ప్రధాన కారణం రుణాలను సకాలంలో క్రమబద్ధీకరించుకోకపోవడమే అని వివరించారు. ప్రధానంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా అప్పు పొందుతున్నవారికి సంబంధించి ఎన్‌పీఏలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. వ్యవసాయ రుణాలందించడంలో ధరణి పోర్టల్‌తో సమస్యలున్నాయన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకిచ్చే రుణ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు తెలిపారు. రుణాలు అవసరమైన కొత్త రంగాలను గుర్తించి వాటికి తోడ్పాటు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఎస్‌బీఐ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీజీఎం వివరించారు.

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల పరిస్థితి?

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మొత్తాన్ని ప్రతి ఏటా పెంచుతున్నాం. బ్యాంకు ఇచ్చే వార్షిక అప్పుల్లో  వ్యవసాయానికి విధిగా 18 శాతం ఉండాలని ఆర్‌బీఐ నిర్దేశించింది. రాష్ట్రంలో 16.79 శాతంగా ఉంది.  వ్యవసాయానికి కీలకమైన అనుబంధ రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆహారశుద్ధి, నిల్వలకు సంబంధించిన వసతులు, మౌలిక సదుపాయాలు, నిల్వ సౌకర్యాలకు సంబంధించి మంచి ప్రతిపాదనలతో ముందుకొచ్చేవారికి తోడ్పాటు అందించేందుకు ఎస్‌బీఐ సిద్ధంగా ఉంది. రుణాలకు అవకాశం ఉన్న వాటిలో ఆయిల్‌పాం కూడా ఒకటి. రాష్ట్రంలో దీనికి సంబంధించి అయిదు క్లస్టర్లున్నాయి. ప్రస్తుతం నర్సరీల ఏర్పాటు జరుగుతోంది. తర్వాత మొక్కల పంపిణీ.. అనంతరం ప్రాసెసింగ్‌ వంటివాటికి రుణాలు విస్తరించాలి. ఇది బహుళ సంవత్సరాల ప్రాజెక్ట్‌ కాగా బ్యాంకులకూ చక్కటి అవకాశం. తెలంగాణలో కార్పొరేట్‌ డెబిట్‌ రీస్ట్రక్చరింగ్‌(సీడీఆర్‌) వంద శాతం కంటే ఎక్కువగా ఉంది. బ్యాంకులు సేకరిస్తున్న డిపాజిట్ల కంటే ఇస్తున్న అప్పుల మొత్తం ఎక్కువ.

రుణాలకు సంబంధించి ధరణి పోర్టల్‌తో సమస్యలేమైనా ఉన్నాయా?

వ్యవసాయ రుణాలందించడంలో ధరణి పోర్టల్‌తో సమస్యలున్నాయి. లోన్‌ఛార్జ్‌ మాడ్యుల్‌లో ఇబ్బందులున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతున్నాం. సమస్యలున్న చోట్ల రుణాలను ఇవ్వలేకపోతున్నాం. ధరణి పోర్టల్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున నోడల్‌ అధికారిని నియమించాలని కూడా కోరాం. కొన్నిసార్లు పోర్టల్‌లో లాగిన్‌ కాలేకపోతున్నాం. అన్ని విషయాలను ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలోనూ వివరిస్తున్నాం.

తెలంగాణలో ఎస్‌బీఐ సేవల విస్తరణ ఎలా ఉంది?

రాష్ట్రంలో బ్యాంకింగ్‌ సేవల్లో 93 శాతం డిజిటల్‌ విధానంలోనే జరుగుతున్నాయి. ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, జనగామలు 100 శాతం డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందించే జిల్లాలుగా మారాయి. ఈ ఏడాది మరికొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి డిజిటల్‌ సేవలు విస్తరించేలా దృష్టిసారించాం. రాష్ట్రంలో 1168 ఎస్‌బీఐ శాఖలుండగా కొత్తగా 17 ప్రారంభిస్తున్నాం. ఇందులో రెండు పూర్తిగా డిజిటల్‌ శాఖలు కాగా ఒకటి స్టార్టప్‌ల కోసం. గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది శాఖలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే మూడు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో గత ఏడాది కొత్తగా 500 ఏటీఎంలను అందుబాటులోకి తేగా ఈ సంవత్సరం మరో 200 ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌లో గృహరుణాలకు భారీ డిమాండ్‌ ఉంది. గృహ రుణదారుల్లో 99.9 శాతం మంది తిరిగి చెల్లింపులు చేస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా అనేక కార్యక్రమాలకు ఎస్‌బీఐ ఆర్థికంగా చేయూతనిస్తోంది.

బ్యాంకింగ్‌ మోసాలు, ప్రధానంగా సైబర్‌ నేరాల అడ్డుకట్టకు ఏం చేస్తున్నారు? 

వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఏ బ్యాంకు అధికారి కూడా ఫోన్‌ ద్వారా లేదా ఎస్‌ఎంఎస్‌, ఇంటర్నెట్‌ ద్వారా కేవైసీ పూర్తి చేయాలని అడగరని గుర్తించాలి. తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్‌లు, ఈమెయిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదు. ఆధార్‌ సంఖ్య, పుట్టిన తేదీ, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు నంబరు, పిన్‌ నంబరు, సీవీవీ, ఓటీపీని ఇతరులకు చెప్పకూడదు. రివార్డులు, గిఫ్ట్‌ల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అప్రమత్తంగా ఉండాలి. మోసపోయామని గుర్తించినప్పుడు కేంద్రం హోంమంత్రిత్వ శాఖ పోర్టల్‌ లేదా 1930 లేదా బ్యాంకులు ఇచ్చిన ఫోన్‌ నంబర్ల ద్వారా వెంటనే ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

కొత్తగా ప్రారంభించనున్న స్టార్టప్‌ శాఖ గురించి?

హైదరాబాద్‌లో ఎస్‌బీఐ ప్రారంభిస్తున్న స్టార్టప్‌శాఖ దేశంలోనే రెండోది. స్ట్టార్టప్‌లకు అవసరమైన అన్ని రకాల సహకారాలు దీని నుంచి అందుతాయి. ఇంక్యుబేషన్‌ సెంటరు కూడా ఉంటుంది. ఇప్పటికే బెంగళూరులో ఇలాంటి శాఖ అందుబాటులోకి రాగా దిల్లీ, చెన్నైలలో కూడా త్వరలో ఏర్పాటవుతాయి.


మరిన్ని

ap-districts
ts-districts