అక్షర జ్ఞానానికి దంపతుల యజ్ఞం!

అక్షర జ్ఞానాన్ని పది మందికి పంచితే సమాజం చైతన్యమవుతుందని గ్రహించిన ఆదిలాబాద్‌ శాంతినగర్‌కు చెందిన ఉపాధ్యాయ దంపతులు పోరెడ్డి అశోక్‌, వసుధ తమ ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అశోక్‌ జైనథ్‌ మండలం కూర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తుండగా వసుధ జైనథ్‌ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. బడుల్లో పాఠాలు బోధించడంతోనే ఆగకుండా వీరు కాలనీలోని పిల్లల్లో పఠనం, అభ్యాసనంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో సొంత ఖర్చులతో నాలుగు నెలల కిందట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో వెయ్యి పుస్తకాలున్నాయి. ఎల్‌కేజీ మొదలుకొని ఇంటర్‌ విద్యార్థుల వరకు ఉపయోగపడేలా కథలు, మహనీయుల జీవిత చరిత్రలు, సైన్సు, గణితం విశేషాలు, శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలతో కూడిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 8 వరకు గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 30 మంది విద్యార్థుల వరకు దీన్ని వినియోగించుకుంటున్నారు. విద్యార్థులు అవసరమైన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లడానికి కూడా ఇస్తున్నారు. భవిష్యత్తులో పట్టణంలోని మురికివాడల్లోనూ గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఆ ఉపాధ్యాయ దంపతులు ‘ఈటీవీ-ఈనాడు’కి చెప్పారు. 

    - ఈటీవీ, ఆదిలాబాద్‌


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు