
Telangana News: చలో మునుగోడు
నవంబరు 3న ఉప ఎన్నిక
ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు షెడ్యూల్ విడుదల
ఈనాడు, దిల్లీ
మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. మునుగోడుతో పాటు బిహార్‌లోని రెండు, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని ఒక్కో శాసనసభ స్థానానికి ఈసీఐ సోమవారం ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. నవంబరులో హిమాచల్‌ప్రదేశ్, డిసెంబరులో గుజరాత్ శాసనసభ ఎన్నికలున్న నేపథ్యంలో ఆ సమయంలోనే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తారన్న అభిప్రాయాలు వినిపించాయి. అందుకు భిన్నంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాల ఉప ఎన్నికలకు ఈసీఐ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి ఒకటిన విడుదల చేసిన ఎన్నికల జాబితానే మునుగోడు ఉప ఎన్నికకు అనుమతిస్తారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీఐ ప్రకటించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడులో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 2న కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 8న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. స్పీకర్ వెంటనే దాన్ని ఆమోదించారు.
మునుగోడుకు తొలి ఉప ఎన్నిక
మునుగోడు నియోజకవర్గం 1967 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏర్పడింది. 2018 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 5సార్లు (1967, 72, 78, 83, 99), సీపీఐ నేతలు ఉజ్జిని నారాయణరావు 3సార్లు (1985, 1989, 1994), పల్లా వెంకట్‌రెడ్డి (2004), ఉజ్జిని యాదగిరిరావు (2009) ఒక్కోసారి గెలుపొందారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (తెరాస) గెలిచారు. వీరంతా పూర్తికాలం శాసనసభ్యులుగా కొనసాగారు. 2018లో గెలిచిన రాజగోపాల్‌రెడ్డి నాలుగేళ్లు నిండక ముందే రాజీనామా చేయడంతో మునుగోడులో తొలిసారి ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు 1967కు ముందు చిన్నకొండూరు శాసనసభ స్థానం పరిధిలో ఉండేది. చిన్నకొండూరులో 1952, 1957, 1962లలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1962లో గెలిచిన కె.గురునాథరెడ్డి (సీపీఐ) ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో 1965లో ఉపఎన్నిక జరిగింది. అందులో కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్ష్మణ్ బాపూజీ విజయం సాధించారు. ఆ ఉపఎన్నిక అనంతరం చిన్నకొండూర్ స్థానం రద్దయి మునుగోడు ఏర్పడింది.
ఇతర రాష్ట్రాల్లో...
మునుగోడుతో పాటు మోకామా, గోపాల్‌గంజ్(బిహార్), అంధేరి ఈస్ట్ (మహారాష్ట్ర), అదంపూర్ (హరియాణా), గోలా గోకర్ణనాథ్ (ఉత్తర్‌ప్రదేశ్), ధామ్‌నగర్ (ఒడిశా) శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. మోకామా శాసనసభ్యుడిగా ఉన్న అనంత్‌సింగ్ (ఆర్జేడీ)కు ఆయుధాల చట్టం కింద పదేళ్ల జైలుశిక్ష పడడంతో ఆయన శాసనసభ్యత్వం రద్దయింది. గోపాల్‌గంజ్, అంధేరి ఈస్ట్, గోలా గోకర్ణనాథ్, దామ్‌నగర్ స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు సుభాష్ సింగ్ (భాజపా), రమేష్ లట్కే (శివసేన), అరవింద్ గిరి (భాజపా), బిష్ణు చరణ్ సేథి (భాజపా) మృతి చెందడంతో అవి ఖాళీ అయ్యాయి. కాంగ్రెస్ తరఫున గెలుపొందిన కులదీప్ బిష్ణోయి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి భాజపాలో చేరడంతో అదంపూర్ స్థానం ఖాళీ అయింది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?