తెలంగాణపై ఎన్జీటీ కొరడా

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు రూ.3,825 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం

ఈనాడు, దిల్లీ: తెలంగాణపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) కొరడా ఝళిపించింది. ఘన, ద్రవ వ్యర్థాలను సరిగా నిర్వహించనందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని వ్యర్థాల ఉత్పత్తికి కారకుల నుంచి వసూలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ నిధిని రెండు నెలల్లోగా ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పర్యావరణ దిద్దుబాటు చర్యల కోసమే దీనిని వినియోగించాలని ఆదేశించింది. మురుగునీటి నిర్వహణ కోసం కొత్తగా శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వ్యవస్థలను ఆధునికీకరించుకోవాలని సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ప్లాంట్లు ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. పర్యావరణ పునరుద్ధరణ పనులను అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిర్దిష్ట కాలపరిమితిలోగా చేపట్టాలని పేర్కొంది. ఒకవేళ ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే.. అదనపు జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని స్పష్టంచేసింది. ఇందుకోసం సీనియర్‌స్థాయి అధికారిని నోడల్‌ సెక్రటరీగా నియమించాలని ఆదేశించింది. ఈ అంశం పురోగతిపై ట్రైబ్యునల్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరు నెలలపాటు ప్రతినెలా నివేదిక పంపాలని పేర్కొంది.

నేపథ్యమిదీ..

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ అంశాన్ని 18 ఏళ్లపాటు విచారించిన సుప్రీంకోర్టు చివరకు ఆ బాధ్యతలను ఎన్జీటీకి బదిలీ చేస్తూ 2014 సెప్టెంబరు 2న ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ గత ఎనిమిదేళ్లుగా ఈ అంశంపై విచారణ చేపడుతోంది. 2016 నుంచి 2022 మే నెల వరకు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో 2019 జనవరి 16 నుంచి విడతలవారీగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పిలిపించి వ్యక్తిగతంగా మాట్లాడింది. 2019 ఏప్రిల్‌ 29న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) హాజరు కాగా, రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరి 14న ఎన్జీటీ ఎదుట సీఎస్‌ మరోసారి హాజరు కాగా 2020 మార్చి 31లోపు జలాశయాల్లో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ విషయంలో విఫలమైతే అందుకు కారణమైన మున్సిపాలిటీ ఒక్కో డ్రెయిన్‌కు నెలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని పేర్కొంది. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటును వెంటనే మొదలుపెట్టాలని, 2021 మార్చి 31 నుంచి పని ప్రారంభించేలా చూడాలని నిర్దేశించింది. వీటి అమలు తీరుపై తెలంగాణ సీఎస్‌ గత సెప్టెంబరు 28న ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. దాన్ని పరిశీలించిన ఎన్జీటీ.. తమ ఆదేశాల అమలులో పెద్దగా పురోగతి లేదని ఆక్షేపించింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఇప్పటికీ తీవ్ర లోపాలున్నాయని తప్పుపట్టింది. 141 పట్టణ స్థానిక సంస్థల్లో 5.9 మిలియన్‌ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దీనికితోడు రోజూ 2,446 టన్నులు పోగవుతోందని గుర్తుచేసింది. పారబోసే స్థలాల్లో పేరుకుపోయిన చెత్త జల, వాయు, భూమి, పర్యావరణ కాలుష్యానికి, ప్రజల అనారోగ్యానికి కారణమవుతోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ ఉత్పత్తవుతున్న మురుగునీరు, శుద్ధి ప్లాంట్ల మధ్య 1,824 ఎంఎల్‌డీ(రోజుకు మిలియన్‌ లీటర్లు) అగాధం ఉందని తెలిపింది. ఇందులో అనధికార కాలనీల నుంచి వెలువడే మురుగునీటిని లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. ప్లాంట్ల ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయిందని గుర్తుచేసింది. ఇప్పటికీ శుద్ధి చేయని మురుగునీటిని అలాగే వదిలేస్తున్నారని, దీంతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతిని రోగాలు ప్రబలి మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేయనందుకు పరిహారం చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోజూ వెలువడుతున్న మురుగునీరు, దాన్ని శుద్ధిచేసే ప్లాంట్ల మధ్య 1,824 ఎంఎల్‌డీ అగాధం ఉన్నందువల్ల ఒక్కో ఎంఎల్‌డీకి రూ.2 కోట్ల చొప్పున రూ.3,648 కోట్లు చెల్లించాలని పేర్కొంది. అలాగే రాష్ట్రంలో పేరుకుపోయిన 5.9 మిలియన్‌ టన్నుల చెత్తకు టన్నుకు రూ.300 చొప్పున రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3,825 కోట్లను రెండు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. 

2019 ఏప్రిల్‌ 29న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలు..

* రాష్ట్రంలో మూడు ప్రధాన నగరాలు, ప్రధాన పట్టణాలు, ప్రతి జిల్లాలో మూడు ప్రధాన పంచాయతీలను ఆదర్శ నగరాలు, పట్టణాలు, పంచాయతీలుగా ప్రకటించాలి. వాటిలో ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం ఆరు నెలల్లోపు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి. మిగిలిన అన్నిచోట్లా ఏడాదిలోపు అమలుచేయాలి.

* ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి మూడు నెలలకోసారి నివేదిక పంపాలి. తొలి నివేదిక 2019 జులై 30కల్లా రావాలి.

* ఆదేశాల అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కనీసం నెలకోసారైనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి పర్యవేక్షించాలి.

* పర్యావరణ నిబంధనల అమలుపై జిల్లా కలెక్టర్‌ తన స్థాయిలో కనీసం రెండు వారాలకోసారైనా పరిశీలన జరపాలి.

* ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి.

* పర్యావరణానికి జరిగిన నష్టం విలువను అంచనా వేసి.. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైన పరిహారం వసూలుకు ప్రణాళిక రూపొందించి ఆ మొత్తాన్ని కాలుష్యానికి కారణమైన వారినుంచి రాబట్టాలి.

* అన్ని నియంత్రణ సంస్థల(రెగ్యులేటరీ బాడీస్‌) పనితీరుపై ఆడిట్‌ నిర్వహించి, ఏమైనా లోపాలుంటే ఆరు నెలల్లోపు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

* ర్యాంకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి పర్యావరణ దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రాంతాలు, సంస్థలు, వ్యక్తులకు ప్రోత్సాహకాలు అవార్డులు ఇవ్వాలి.


మరిన్ని