ప్రతి పది పాయింట్లలో ఒకటి ఎస్టీలకు

గిరిజన రిజర్వేషన్‌ విధివిధానాలపై అధికారుల కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 10 శాతం గిరిజన రిజర్వేషన్ల అమలుకు విధివిధానాలపై కసరత్తు జరుగుతోంది. రిజర్వేషన్లను ప్రభుత్వం ఆరు నుంచి పది శాతానికి పెంచిన నేపథ్యంలో ఆ మేరకు రోస్టర్‌ పట్టికలో పాయింట్ల ఖరారు, విద్యాసంస్థల్లో చేపట్టే ప్రవేశాల్లో పాటించాల్సిన నిబంధనల తయారీపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రోస్టర్‌ పట్టికలోని వంద పాయింట్లలో ప్రతి 10 పాయింట్లకు ఒకటి ఎస్టీలకు రిజర్వు చేయాలని భావిస్తున్నారు. రోస్టర్‌ పాయింట్లు ఖరారైన తరువాత ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను సవరించాలని ఆయా శాఖలు నిర్ణయించాయి. ఈ సవరణలు ఖాళీల మేరకు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదైనా విభాగంలో ఖాళీల సంఖ్య 10లోపు ఉంటే పెద్దగా మార్పులు ఉండవు. పదికి మించితే మార్పులుంటాయి. ప్రస్తుత రోస్టర్‌లో తొలి 30 పాయింట్లలో రెండు పాయింట్లు మాత్రమే గిరిజనులకు రిజర్వు అయ్యాయి. 11-20 మధ్యలో ఒక్కటీ లేదు. తాజా అంచనాల మేరకు ఒక పాయింట్‌ వచ్చే అవకాశముంది. ఇలాగే ప్రతి పది పాయింట్లకు ఒకటి గిరిజనులకు దక్కుతుంది. 

విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో చేపట్టే ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గిరిజన సంఘాలు, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంసెట్‌ తొలి విడత ప్రవేశాలు పూర్తయ్యాయి. రెండోది ఇంకా మొదలు కాలేదు. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నీట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌ తదితరాల కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది.

కాళోజీ వర్సిటీ సన్నాహాలు

పెరిగిన ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం వైద్యవిద్యలో సీట్లను భర్తీచేయాలని కాళోజీ వర్సిటీ భావిస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లలో ఇది అమలు కానున్నట్లు తెలుస్తోంది.


మరిన్ని