
ప్రతి కనెక్షన్‌కు స్మార్ట్‌మీటరు పెట్టుకోరూ!
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్‌శాఖ రాయబారం
తెలంగాణలోని రెండు డిస్కంలకు రూ.17 వేల కోట్లు వచ్చే అవకాశం
మంత్రివర్గం ఆమోదిస్తేనే కేంద్రం నుంచి డిస్కంలకు నిధులు
ఈనాడు, హైదరాబాద్: ప్రతి కరెంటు కనెక్షన్‌కు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరు పెట్టడానికి అంగీకరించాలని కేంద్ర విద్యుత్‌శాఖ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ‘డిస్కంల పునర్వ్యవస్థీకరణ పథకం’లో చేరాలని కేంద్రం తరఫున ‘గ్రామీణ విద్యుదీకరణ సంస్థ’ (ఆర్ఈసీ) సీఎండీ వివేక్‌కుమార్ హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ పథకంలో రాష్ట్రం చేరితే మొత్తం రూ.17 వేల కోట్ల రుణాలు వచ్చే అవకాశముందని.. వీటిని తీసుకోవడానికి అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి 4 నెలల క్రితమే ప్రతిపాదనలు పంపాయి. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిస్తేనే పథకంలో చేర్చుకుంటామని కేంద్రం షరతు పెట్టినందున సీఎం అనుమతి కోసం డిస్కంలు ఎదురుచూస్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి త్వరగా ప్రతిపాదనలు పంపితే వాటికి నిధులు మంజూరుచేస్తామని కేంద్ర విద్యుత్‌శాఖ తెలిపింది. ఇప్పటికే 12 రాష్ట్రాలకు రూ.లక్షన్నర కోట్లు మంజూరుచేసింది. విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు పూర్తికాక డిస్కంలకు నష్టాలొస్తున్నాయి. కేంద్రాల్లో ఉత్పత్తవుతున్న విద్యుత్ వినియోగదారుల ఇళ్లకు చేరేసరికి మధ్యలో 20 నుంచి 25 శాతం ఎటుపోతుందో లెక్కతేలడం లేదు. కరెంటు సరఫరా, పంపిణీలో (టీడీ) నష్టాలను తగ్గించాలని, ప్రతి కనెక్షన్‌కు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరు పెట్టాలని, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని డిస్కంల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని కేంద్రం గతేడాది ప్రకటించింది. నిబంధనలు పాటించి అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా టీడీ నష్టాలను తగ్గిస్తామని, వెంటనే స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెడతామని డిస్కంలు ముందుకొస్తే ఈ నిధులు ఇస్తామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే డజను రాష్ట్రాల డిస్కంలు ఈ ప్రతిపాదనలివ్వడంతో వాటికి నిధులు మంజూరుచేసింది.
మీటర్లకు రూ.8 వేల కోట్లు కావాలి
తెలంగాణ డిస్కంలు రూపొందించిన ప్రతిపాదనల్లో తొలి దశ కింద రాష్ట్రవ్యాప్తంగా నెలకు 500 యూనిట్లకు పైగా కరెంటు వాడుకునే ప్రతి కనెక్షన్‌కు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరు పెడతామని తెలిపాయి. వీటి ఏర్పాటుకే రూ.8 వేల కోట్లు కావాలని ప్రతిపాదించాయి. టీడీ నష్టాలు రాష్ట్రంలో విద్యుత్ డివిజన్లను బట్టి 12 నుంచి 20 శాతం వరకూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో కొన్ని డివిజన్లలో టీడీ నష్టాలు 30 శాతానికి పైగా ఉన్నాయని రాష్ట్ర ‘విద్యుత్ నియంత్రణ మండలి’ (ఈఆర్సీ) సైతం గుర్తించింది. వీటిని తగ్గించడానికి రూ.9 వేల కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేనందున కేంద్ర విద్యుత్‌శాఖ దీనిపై చొరవ తీసుకుని తాజాగా కేంద్ర ఉన్నతాధికారిని ప్రత్యేకంగా పంపినట్లు తెలుస్తోంది. కానీ ఒక్కో కనెక్షన్‌కు స్మార్ట్‌మీటరు పెట్టడానికి కేంద్రం కేవలం రూ.900 మాత్రమే సాయంగా ఇస్తుందని, మిగిలిన రూ.3 వేల వరకూ సొమ్మును డిస్కంలు ఎలా భరిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అదనంగా రుణాలు తీసుకుంటే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వ పద్దు కింద కేంద్రం చూపితే రుణభారం మరింత పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో ఈ ప్రతిపాదనలు పెట్టి చర్చిస్తే తప్ప ఆమోదం లభించదని సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు