దసపల్లా భూములపై కింకర్తవ్యం?

విశాఖ జిల్లా యంత్రాంగం తర్జనభర్జన

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైన విశాఖ దసపల్లా భూముల వ్యవహారంలో ముందుకెలా వెళ్లాలనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇదే జిల్లాలో గతంలో జరిగిన భూవ్యవహారాల్లో పలువురు అధికారులు క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. విశాఖలో చోటుచేసుకున్న భూకుంభకోణాలపై 2017లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) జరిపిన విచారణకు ఉప తహసీల్దారు స్థాయి అధికారుల నుంచి ఉప కలెక్టర్‌ స్థాయి అధికారుల వరకు హాజరయ్యారు. అప్పట్లో జేసీ, కలెక్టర్లుగా పనిచేసిన పలువురు ఐఏఎస్‌లకు సైతం సిట్‌ ప్రశ్నావళి పంపి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే దసపల్లా వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో వైకాపా ముఖ్య నేతల హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

దసపల్లా భూములకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రభుత్వ పిటిషన్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో తగిన చర్యలను తీసుకొనే బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ సీసీఎల్‌ఏ ఇటీవల మెమో జారీ చేసింది. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దసరా సెలవుల తర్వాత పరిశీలించాలని భావిస్తున్నారు. యూఎల్‌సీ (అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌) కోణంలో గతంలో జరిగిన దస్త్రాలను తనిఖీ చేయనున్నట్లు తెలిసింది. ఆచితూచి వ్యవహరించకుంటే తమకు ఇబ్బందులు వచ్చే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

తీవ్రస్థాయి ఒత్తిళ్లతో ఆందోళన

ఇటీవల విశాఖ జిల్లాలో జరిగిన భూ వ్యవహారాల్లో పలువురు తహసీల్దార్లు క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. వైకాపా ఎమ్మెల్యే ఒత్తిడితో ఓ ప్రైవేటు వ్యక్తి భూమిని రికార్డులో రెండు, మూడుసార్లు రాసినందుకు ఓ తహసీల్దార్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. విశాఖ రూరల్‌ మండల పరిధిలో అధికార పార్టీ ఎంపీ భూవ్యవహారంలోనూ సకాలంలో స్పందించలేదని మరో తహసీల్దార్‌ను బదిలీ చేశారు. అధికార పార్టీ నేతల అనుకూలంగా పనిచేయనందుకే ఈ బదిలీ జరిగిందనే ప్రచారమైంది. ఇదేసమయంలో... దసపల్లా వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.


మరిన్ని

ap-districts
ts-districts