34 వేల మంది.. 22,833 ఎకరాలు

రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో గొత్తికోయల గుత్తాధిపత్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో గొత్తికోయల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు గతంలో అక్కడ నక్సల్స్‌, సల్వాజుడుం మధ్య పోరులో నలిగిపోతూ బతుకుదెరువు కోసం వలసవచ్చి పోడు సాగు చేసేవారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆ సమస్య ఇప్పుడంతగా లేకపోయినా పెద్దసంఖ్యలో రాష్ట్రానికి వస్తూనే ఉన్నారు. పోడుతోపాటు మిర్చి, పత్తి చేలల్లో పనుల కోసం వస్తున్న వీరు ఇక్కడి అటవీప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34,265 మంది గొత్తికోయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి అధీనంలో 22,833 ఎకరాల అటవీభూమి ఉన్నట్లు ఆ శాఖ సమాచారం. అయితే స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్నవారు వీళ్లను పావులుగా వాడుకుంటూ పోడు చేయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. రేంజర్‌ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో గొత్తికోయల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వీరి ఆవాసాలు ఉన్నాయి. ఇందులో కొత్తగూడెం జిల్లాలో సమస్య అధికంగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే 23,990 మంది గొత్తికోయలు ఉన్నట్లు అటవీవర్గాల సమాచారం.

రాష్ట్రంలోని గిరిజనులు గ్రామాల సమీపంలోని అటవీభూముల్లో పోడు సాగు చేస్తుంటే.. గొత్తికోయలు మాత్రం అడవి మధ్యలో చేస్తుంటారు. వన్యమృగాలు సంచరించే ప్రాంతంలోనే నివసిస్తూ.. బాణాలు, ఇతర ఆయుధాలతో తిరుగుతుంటారు. ‘గొత్తికోయలతో గతంలో ఘర్షణలు జరిగినా అవి చిన్నచిన్నవే. వారి దాడిలో ఓ అధికారి చనిపోవడం మాత్రం ఇదే తొలి సారి’ అని అటవీశాఖ మాజీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గొత్తికోయలు ఆయా మండలాల్లో ఆధార్‌, రేషన్‌ కార్డుల పొందడంతోపాటు ఓటర్లుగా కూడా నమోదవుతున్నారు. సాధారణంగా జీవనాధారం కోసం ఒకసారి అడవిని నరికేస్తారు. గొత్తికోయలు మాత్రం పలుమార్లు నరికేస్తుండటం వెనుక స్థానిక నేతలు ఉన్నారని, ఆ భూముల్ని తమ అధీనంలో ఉంచుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

హరితహారంతో..

గొత్తికోయలు సాగుచేస్తున్న భూములను పలుచోట్ల అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని హరితహారంలో భాగంగా మొక్కలు పెంచుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల వారితో ఘర్షణలు జరుగుతున్నాయి. ‘ఇక్కడి వాళ్లే కూలీ పనులకోసం ఛత్తీస్‌గఢ్‌ నుంచి గొత్తికోయల్ని రప్పిస్తున్నారు.. ఆ తర్వాత వాళ్లు తిరిగి వెళ్లకుండా అడవుల్లో ఆవాసం ఏర్పాటుచేసుకుని చెట్లను నరికేస్తున్నారు. వీరి సంఖ్య 50 వేల వరకూ ఉండొచ్చు’ అంటూ అటవీశాఖలో కీలక బాధ్యతలుచూసే అధికారి ఆందోళన వ్యక్తంచేశారు.


మరిన్ని